పేరు వింటేనే ఏవగింపు, చూసినంతనే అసహ్యంతో ఒంటిని జలదరింపజేసే బొద్దింకలు కొన్ని రోజులుగా పత్రికల పతాక శీర్షికలకు ఎక్కుతున్నాయి. ‘సమాజంలోని కొంతమంది బొద్దింకల్లా మారి వ్యవస్థపై దాడి చేస్తున్నారు. ఉద్యోగాలు లేని సామాజిక మాధ్యమాలు, ఆర్టిఐ కార్యకర్తలుగా మారి వ్యవస్థపై దాడి చేస్తున్నారు’ అంటూ కొన్ని రోజుల క్రితం ఒక కేసు విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావానికి బాటలు వేశాయి. తన మాటలు యువతను ఉద్దేశించి కావని న్యాయమూర్తి వివరణ ఇచ్చిన ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై యువతలో మిన్నంటిన ఆగ్రహావేశాలు సామాజిక మాధ్యమాల్లో ప్రతిఫలించాయి. ఈ నేపథ్యంలో పార్టీ అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పేరును అనుకరిస్తూ, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి తమను ఏ కీటకంతో పోల్చారో అదే కీటకం పేరుతో వ్యంగ్యాత్మకంగా రూపొందించిన కాక్రోచ్ జనతా (సిజెపి) ఇప్పుడు సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది.
ప్రస్తుతానికి సామాజిక మాధ్యమాలకే పరిమితమైన ఈ పార్టీ కళ్లు తెరిచి పట్టుమని పదిరోజులైనా కాకముందే తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో రెండు కోట్ల మందికి పైగా ఫాలోవర్లను సంపాదించడం ఆశ్చర్యమే. అధికార భారతీయ జనతా పార్టీకి సామాజిక మాధ్యమాల్లో గల ఆదరణ ఎన్నో రెట్లు ఎక్కువ ఆదరణను సిజెపి నాలుగైదు రోజుల్లోనే సొంతం చేసుకుంది. కొన్నేళ్లపాటు శ్రమిస్తేనేగాని ఒక రాజకీయ పార్టీ ప్రజాభిమానాన్ని చూరగొని నిలదొక్కుకోవడం కష్టసాధ్యమైన పరిస్థితుల్లో కళ్లు తెరిచి తెరవకముందే ఇంతటి ఆదరణను కైవసం చేసుకోవడం ఒక అద్భుతం. మరొక విధంగా చెప్పాలంటే, యువతరంలో పెల్లుబుకుతున్న నిరాశ నిస్పృహలకు ఈ పరిణామాన్ని తార్కాణంగా చెప్పుకోవచ్చు. సామాజిక మాధ్యమాలను ఆసరా చేసుకుని యువతరం దేశ రాజకీయ స్థితిగతుల్నే సమూలంగా మార్చివేస్తున్న సంఘటనలు కొత్తేమీ కాదు. సామాజిక మాధ్యమాలను నిషేధించినందుకే యువతరం ఒక్కటై నేపాల్ లో ప్రభుత్వాన్ని కుప్పకూల్చిన సంఘటన మన కళ్లముందు కదలాడుతూనే ఉంది. బంగ్లాదేశ్ లోనూ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టడంలో యువతే కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో అదే తరహాలో భారత్లో కళ్లు తెరిచిన సిజెపి ఇతర రాజకీయ పార్టీల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. సామాజిక మాధ్యమాలలో బలపడుతున్న సిజెపిని దెబ్బకొట్టాలన్న ఉద్దేశంతో కేంద్రం సిజెపి వెబ్సైట్ను, ఎక్స్కౌంట్ స్తంభింపజేయడం దాని ఉలికిపాటుకు నిదర్శనం. ప్రభుత్వంలోని పెద్దలు కొందరు దీని వెనుక ఆమ్ఆద్మీ పార్టీ ఉందంటే, మరికొందరు పాకిస్తాన్ మద్దతు ఉందంటూ బురద జల్లే ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కొన్ని రాజకీయ అవకాశవాద ప్రతిపక్షాలు సిజెపితో చేతులు కలిపేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. అవినీతి, నిరుద్యోగం, అసమానతలు వంటి సమాజంలో వేళ్లూనుకుపోయిన సమస్యలను రూపుమాపడంలో విఫలమవుతున్నారు.. ముఖ్యంగా యువతలో నిరాశానిస్పృహలు అంతకంతకు పెరిగిపోతున్నాయి.
నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తికి చిన్న కట్టెపుల్ల దొరికినా దాన్ని అందిపుచ్చుకునే చందంగా యువతరం ఇప్పటికప్పుడు వెలుగులోకి వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ వైపు చూడటంలో ఆశ్చర్యం ఏముంది? అయితే సామాజిక మాధ్యమాలలోంచి పుట్టుకొచ్చిన ఈ కొత్త పార్టీ ప్రబల రాజకీయ శక్తిగా ఎలా మారుతుందనేదే వెయ్యి కొత్త ప్రశ్న. ప్రస్తుతానికి రాజకీయ అనుభవం లేని, పాతికేళ్లలోపు యువతరమే ఈ పార్టీకి అండదండ. పారదర్శక పాలన, ప్రజల భాగస్వామ్యం, యువతకు ఉపాధి, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలను ముందుకు తెస్తూ, ప్రజల విధాన నిర్ణేతలనే నినాదాన్ని బలంగా ప్రజలలోకి తీసుకువెళుతున్న సిజెపి, వాటిని అమలు చేయడానికి పటుతరమైన కార్యాచరణ ప్రణాళికను ప్రత్యక్షంగా రూపొందించి, ప్రజల ముందు ఉంచడం ముఖ్యం. తన ఆవిర్భావ స్ఫూర్తిని కాపాడుకుంటూ ప్రజలతో నిరంతరం అనుబంధాన్ని కొనసాగించగలిగితే ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగే అవకాశం ఉంటుంది. లేనిపక్షంలో మఖలో పుట్టి పుబ్బలో మాడిపోయిన చందంగా కనుమరుగు కాకతప్పదు. ‘సోమరులు, నిరుద్యోగుల గొంతుక’ అనే ట్యాగ్ లైన్తో ప్రజల ముందుకు వచ్చిన సిజెపి ప్రతికూల పరిస్థితుల్లోనూ మనుగడ సాగించే లక్షణాలు బొద్దింకలాగే యువశక్తికి ప్రతీకగా, స్వచ్ఛమైన, పారదర్శకమైన రాజకీయాలను నడిపే పార్టీగా ఎదుగుతుందని ఆశిద్దాం.

