అమెరికాను ప్రపంచంలోకెల్లా శక్తివంతమైన ప్రజాస్వామ్యం అని ప్రచారం చేస్తారు. ఇజ్రాయెల్‌ను మొత్తం పశ్చిమాసియాలో ఏకైక ప్రజాస్వామ్యమని అదే విధంగా ప్రచారాలు సాగుతుంటాయి. ఈ మాటలు విని భయపడుతుంది. ఇటీవలి నాలుగు ఉదంతాలను గుర్తు చేసుకుంటే, ఆ రెండు దేశాల ప్రజాస్వామ్యం ఎటువంటిదో మనకు మొహం మీద చాచి కొట్టినట్లు అర్థమవుతుంది. మొదటిది, ఈ సంవత్సరం జనవరిలో వెనిజులాపై అమెరికా అర్ధరాత్రి ఆకస్మిక దాడి జరిగింది, ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన భార్యను అపహరించటం. రెండవది, ఇరాన్‌తో చర్చలు ఆశావహంగా సాగుతుండగానే అకస్మాత్తుగా ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్‌తో కలిసి దాడులు జరపడం. మూడవది, అట్లా దాడి చేయటమే గాక ఇరాన్ అధినేత ఖమేనీని కుటుంబంతో సహా ప్రాణాలు తీయటం. నాల్గవది, ఇరాన్‌తో చర్చలు ఈ నెల 21, 22 తేదీలలో స్విట్జర్లాండ్‌లో కొనసాగుతున్నాయి, ఇరాన్ అధ్యక్షుడు పెష్కియాన్ నాయకత్వాన చర్చలలో పాల్గొంటున్న అమెరికా సంయుక్త ప్రకటన ఒప్పందంపై సంతకాలు చేయవలసిందని, లేనప్పుడు వారు తమ దేశానికి తిరిగి వెళ్లలేరని బెదిరించటం. తిరిగి వెళ్లలేకపోవడమంటే ఏమిటో చెప్పనక్కర్లేదు.
అంతేకాదు. ఎంతో ఘనమైన చరిత్ర, సంస్కృతి గల ఇరాన్‌ను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు బూతు మాటలన్నారు. అంతటితో ఆగక, సంతకాలు చేయనట్లయితే అసలు ఆ దేశం అంటూ మిగలబోదన్నారు. ఆయన కొన్ని వారాల క్రితం కూడా ఇదే విధంగా ఒకసారి మొత్తం ఇరాన్‌ను, దాని నాగరికతను రాత్రికిరాత్రి తుడిచిపెట్టగలనని హెచ్చరించటం తెలిసిందే. ట్రంప్ అదంతా చేయగలడా అన్నది వేరే విషయం. కానీ పైన నాలుగు ఉదంతాలను బట్టి అమెరికా అధ్యక్షుడు, ఆయన దేశం ప్రజాస్వామికత ఎటువంటివని మనం భావించాలి? మొదట అనుకున్నట్లు ఇవి ఇటీవలి విషయాలు మాత్రమే. గతంలోకి వెళితే, ఇటువంటివి, ఇంతకన్నా భయంకరమైనవి అనేకానేక దారుణమైన చర్యలు అమెరికా నుంచి కనిపిస్తున్నాయి. వాటిలో మూడింటిని చూద్దాము. ఆఫ్రికాలోని డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అధ్యక్షుడు ప్యాట్రిస్ లుముంబా అక్కడి వనరులను తమకు అప్పగించినందుకు 1961లో హత్య చేయడమే గాక, తన శరీరాన్ని ముక్కులు చేసి సల్ఫూరిక్ ఆసిడ్‌లో వేసి కరిగించారు.
ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌పై సామూహిక మారణాయుధాల తప్పుడు ఆరోపణలు చేసి 2006లో చంపారు. అటువంటి ఆయుధాలేవీ లేవని తర్వాత బహిరంగంగా ఒప్పుకున్నారు. నిజానికి ఆ విషయం ముందే తెలిసినా అసత్యపు ప్రచారాలు అని అమెరికన్ అధికారుల తర్వాత బయటపెట్టారు. క్యూబాకు 1959- 2008 మధ్య కాలంలో కొంత కాలం అధ్యక్షునిగా, కొంత కాలం ప్రధానిగా పనిచేసిన ఫిడెల్ క్యాస్ట్రోపై, నమ్మశక్యం కాని రీతిలో 638 సార్లు హత్యాయత్నం చేసారు. వీరు ముగ్గురూ ప్రజాస్వామికంగా ఎన్నికైనవారే. ఇటువంటి ప్రజాస్వామిక నాయకులపై, ప్రభుత్వాలపై కేవలం తమ సామ్రాజ్యవాద ప్రయోజనాలకు అనుకూలం కానందుకు జరిపిన కుట్రపూరిత చర్యలు గత 66 సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనన్ని ఉన్నాయి. యూరోపియన్ రాజ్యాల ఇదే తరహా చర్యలు ఇందుకు కారణం.
దీనంతటిలోని అద్భుతం ఏమంటే, తాము ఇవన్నీ చేయటం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమని చెప్తారు. ఆ ముసుగులో అసలు ఉద్దేశమేమిటన్నది తెలియని వారు బహుశా ఎవరూ ఉండరు. ఇపుడు ప్రస్తుతానికి వచ్చి పైన ప్రస్తావించిన ఉదంతాల గురించి మాట్లాడుకుందాం. వెనిజులాపై అమెరికా అర్ధరాత్రి దాడి సాక్షాత్తు అమెరికన్ మిత్ర దేశాలతోసహా ప్రపంచాన్నంతా దిగ్భ్రాంతికి గురి చేసింది. వెనిజులా నుంచి అమెరికాకు మాదకవ్యాలు రవాణా అవుతున్నాయనే ట్రంప్ ఆరోపణ కాదని స్వయంగా అమెరికా ప్రభుత్వ రికార్డులే స్పష్టం చేశాయి. అమెరికన్ మీడియా సైతం కథనాలు ప్రచురించింది. అయినప్పటికీ దాడికి పాల్పడ్డ ట్రంప్ చేసారు, ప్రజాస్వామికంగా ఎన్నికైన మదురోపై నియంత అంటూ ఎడతెగని ప్రచారం. తన అసలు లక్షం అక్కడి చమురు నిల్వలను, ఇతర వనరులను చేజిక్కించుకోవటమేనని ఆ తర్వాత ఆయన మాటలలోనే వెలడింది.
చమురు నిల్వల విషయంలో ఆ దేశం ప్రపంచంలోనే మొదటిస్థానం ఉంది. ఇపుడక్కడ తమ చెప్పుచేతలలో ఉండే ప్రభుత్వాన్ని నిలబెట్టి, చమురును కొల్లగొట్టేందుకు వెంటనే అమెరికన్ కంపెనీలను రంగంలోకి తెచ్చారు. ఇదీ అమెరికన్ బ్రాండ్ ప్రజాస్వామ్యం. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్యపు పని తీరుకు తక్కిన మూడు ఉదంతాలు కూడా ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఇరాన్ మొదటి నుంచి కూడా తమ అణు విధానం శాంతియుత ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవటమే తప్ప, అణ్వస్త్రాల తయారీకి కాదని స్పష్టంగా ప్రకటించూ వస్తున్నది. ఆ మేరకు అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పిటి)పై సంతకాలు కూడా చేసింది. అది గాక అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్‌లతో ఉమ్మడి ఒప్పందానికి వచ్చింది. వారి అణు పరిశోధనలను ఐక్యరాజ్యసమితికి చెందిన అణు ఇంధన సంస్థ (ఐఈఈ) ఇంటర్నేషనల్ ఇన్స్పెక్టర్లు తరచు తనిఖీ చేస్తున్నారు.
ఆ ఒప్పందాన్ని ట్రంప్ తన మొదటి హయాంలో రద్దు చేసి దానికి మార్పులు అవసరమని, ఇరాన్ సమ్మతించి చర్చలు జరుపుతుండగా, చర్చల మధ్యలోనే గత ఫిబ్రవరి 28న ఇరాన్‌పై దాడులు మొదలు పెట్టడం తెలిసిందే. ఇరాన్‌ను ఏ విధంగానైనా ధ్వంసం చేసి తీరాలంటే పట్టుదల గల ఇజ్రాయెల్ ప్రోద్బలంతోనే దాడులు జరుగుతున్నాయి. దాడులతో ఇజ్రాయెల్ కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం మన చర్చకు సంబంధించిన ప్రశ్న ఏమంటే, దీనంతటిలో ప్రజాస్వామ్యం ఎక్కడ? తమ ప్రయోజనాల కోసం చేసేదంతా చేస్తూ ముసుగులు తొడుగుతున్నారు. ఇరాన్ అణ్వస్త్రాలు తయారు చేయబోతున్నదనే అతి పెద్ద అబద్ధం వాటిలో ఒకటి. తయారు చేయబోతున్నదన్నది ఇజ్రాయెల్ పాతికేళ్లుగా చెప్తున్న అబద్ధమే. ఇది చాలదన్నట్లు, ఇరాన్‌లోని నియంతృత్వ పాలనను కూలదోసి అక్కడి ప్రజలకు ప్రజాస్వామిక ప్రభుత్వ అవకాశాలు కల్పిస్తామని కొత్త పాట ఒకటి మొదటిపెట్టారు. అక్కడి ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ఆ మార్పును తెచ్చే అధికారం బయటి శక్తులకు ఎక్కడి నుంచి వస్తుంది?
ఇజ్రాయెల్‌ను పశ్చిమాసియాలోని ఏకైక ప్రజాస్వామ్యమని ప్రచారం చేస్తారు. అటువంటి ఏకైక ప్రజాస్వామ్యం ఏ విధంగా ప్రవర్తించినా సరే అది ప్రజాస్వామ్యం గనుక వారి చర్యలను బలపరచాలని స్వయంగా ఇజ్రాయెల్‌తోపాటు అమెరికా, యూరోపియన్ దేశాలు వాదిస్తుంటాయి. వారి అసలు ప్రయోజనాలు వేరే అన్నది అట్లుంచితే, ప్రజాస్వామ్యం అనేది ఒక్కటే గీటురాయి అయిన పక్షంలో, పశ్చిమాసియాలోని అరబ్ రాజ్యాలలో ఏది ఆ వర్గీకరణలోకి రాదు. ఇరాన్‌కు భిన్నంగా అవన్నీ అరబ్ షేక్‌ల కుటుంబ రాజ్యాలే. కానీ అక్కడ ప్రజాస్వామ్యం కోసం అమెరికా శిబిరానికి ఎటువంటి చింతలూ లేవు. పైగా ఆ కుటుంబ రాజ్యాలు నిరాటంకంగా కొనసాగేందుకు అవసరమైన వన్నీ ఉంటారు. సందర్భం వచ్చింది కనుక ఈ మాట అనుకుంటున్నాము గాని, అమెరికన్లు, యూరోపియన్లు తమకు ఉపయోగపడే నియాంతృత్వాలకు మద్దతు ఇచ్చిన, ఇంకా ఇస్తున్న సందర్భాలు ఎన్నయినా ఉన్నాయి. అందుకే వీరంతా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలను వల్లించటమే. క్షమించాలి. వీరికన్న దయ్యాలు అనేక రెట్లు మెరుగు.
మూడవ విషయం ఫిబ్రవరి 28న దాడిలో ఖమేనీని, తన కుటుం బాన్ని బలి తీసుకోవటం. అది అనుకోని విధంగా జరిగిన ఘటన కాదు. ఉద్దేశపూర్వకంగా ఇజ్రాయెల్, అమెరికా కలిసి చేసినటువంటిది. వెనిజులలో అధ్యక్షుడిని, కుటుంబాన్ని అపహరిస్తే కేవలం గంటల వ్యవధిలో కార్యం ముగిసిపోయినట్లు ఇరాన్లో దేశాధినేతను, కుటుంబాన్ని ప్రాణాలు తీసే ఒక్క రోజులోనే అంతా పూర్తవుతుందనే వ్యూహమని అమెరికన్ వర్గాలే వెల్లడిస్తున్నాయి. ఆ వ్యూహం నెరవేరలేదన్నది వేరే విషయం. కానీ ఆ విధంగా చర్చల మధ్యలో దాడి జరగటమే గాక దేశాధినేతను కుటుంబంతో సహా హతం చేయడం ఏ ప్రజాస్వామ్యమవుతుందనే ప్రశ్న. తమ చర్యలను చివరకు తమ యూరోపియన్ మిత్రులతో సహా ప్రపంచమంతా విమర్శిస్తున్నా ఈనాటి వరకు పశ్చాత్తాపమన్నదే కనిపించడం లేదు. అదే రోజున ఒక స్కూలుపై క్షిపణిని ప్రయోగించి సుమారు 160 మంది పిల్లలను బలి తీసుకున్న నీచమైన చర్యపై కూడా. వారి నిర్లజ్జాకరమైన వాదనలలో ఇది ప్రపంచంలో ప్రజా స్వామ్య పరిరక్షణ కోసమే.
నాల్గవ ఘటన ఇదే వారంలో స్విట్జర్లాండ్ చర్చల సందర్భంగా జరిగింది. ఏ విషయం గురించి చర్చలు, ఒప్పందాలన్నది సాధారణంగా జరిగేది. అది ప్రజాస్వామ్యమవుతుంది. కానీ ఒక పక్షం తను చెప్పినట్లే చేసి తీరాలని, లేనట్లయితే ఎదుటి పక్షాన్ని అంతు చూస్తానని బాహాటంగా బెదిరిస్తే? స్విట్జర్లాండ్ చర్చలు జరుగుతుండగా ఇరాన్ ప్రతినిధి వర్గాన్ని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు చేసిన బెదిరింపు ఏమిటో పైన చూసాము. ఇరాన్ ఎప్పటివలెనే ఈసారికూడా బెదరకపోవటమేగాక అందుకు నిరసనగా చర్చల హాలు నుంచి నిష్క్రమించింది. దానితో ట్రంప్ దిగిరావటం తెలుస్తుంది. కానీ, అటువంటి సామ్రాజ్యవాద దురహంకారులు ప్రపంచంలో కెల్లా గొప్ప ప్రజాఆస్వామ్యం వంటి మాటలు మాట్లాడటం చెల్లుబాటు అయ్యేది కాదు. తాము ఈ విధంగా వ్యవహరిస్తూ మరెవరో నియంతలను, అక్కడ ప్రజాస్వామ్యం లేదని ప్రచారాలు సాగిస్తుంటారు.
చివరగా చెప్పుకోవలసిన విచారకరమైన విషయం ఒకటుంది. అది, భారతదేశంలో సామాన్యులు అనేకులు కూడా అమెరికా ఒక పెద్దదయిన, గొప్పది అయిన ప్రజాస్వామిక దేశమని భావించటం. ఆరాధించటం. అకప్పుడు ఇట్లా ఉండేది కాదు. సామ్రాజ్యవాద వ్యతిరేకత బలంగా ఉండేది. మీడియాలోనూ. ముఖ్యంగా వియత్నాం నుంచి మొదలుకొని ప్రస్తుత ఇరాన్ వరకు, ఇరాన్ అంశంతో ముడిపడి ఉన్న పాలస్తీనా సమస్య వరకు అమెరికా నిజస్వరూపం వెల్లడి అవుతున్నది, అమెరికా ప్రజాస్వామ్యం గురించి భ్రమలు ఏర్పడి యుద్ధం కొనసాగడం మనం క్షమించుకోలేని స్థితి. అమెరికా ధనవంతమైనదని, స్వేచ్ఛావకాశాలు ఎక్కువని, అక్కడ మనకేమైనా లభించవచ్చుననే ఆశలు మాత్రమే ఇందుకు కారణమని, అవి మనలోని విచక్షణను, మానవత్వాన్ని, ప్రజాస్వామిక భావనలను దెబ్బ తీస్తున్నాయని అనిపిస్తోంది.
– టంకశాల అశోక్ (దూరదృష్టి)
(రచయిత సీనియర్ సంపాదకులు)

