- సింధు జలాల కోసం భారత్‌పై ఒత్తిడి తీసుకురావాలి..
- కెనడాను కోరిన పాకిస్తాన్, స్పందన కరువు..
సింధు జలాల ఒప్పందం: సింధు జలాల ఒప్పందం (ఇండస్ వాటర్స్ ట్రీటీ-IWT) పునరుద్ధరణ కోసం భారత్‌పై ఒత్తిడి తీసుకురావాలని పాకిస్థాన్ కోరింది. అయితే, పాకిస్తాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కెనడా విదేశాంగ మంత్రి అనిత ఆనంద్ పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన సమయంలో, ఆమె ముందు పాకిస్తాన్ తన కోరికను ప్రదర్శించింది. ఇస్లామాబాద్‌లో జరిగిన సంయుక్త సమావేశంలో పాక్ చేసిన విజ్ఞప్తిపై కెనడా విదేశాంగ మంత్రి అనిత ఆనంద్ అసలు స్పందించలేదు.
పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మాట్లాడుతూ, సింధు జలాల ఒప్పందాన్ని వెంటనే పునరుద్ధరించడానికి భారత్‌పై ఒత్తిడి తీసుకురావాలని కెనడాతో పాటు మిత్రదేశాలకు విజ్ఞప్తి చేశారు. నీటిని ఆయుధంగా వాడటాన్ని ఆయన వ్యతిరేకించాలని. అయితే, భేటీ అనంతరం కెనడా విడుదల చేసిన అధికారిక ప్రకటనలో సింధు జలాల ఒప్పందం, పాకిస్థాన్ విజ్ఞప్తిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర సహకారంపై మాత్రమే కెనడా తన ప్రకటనను పరిమితం చేసింది.
సాయం కోరుతున్న పాక్:
2025 ఏప్రిల్ నెలలో జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ దాడి తర్వాత భారత్ ”సింధు జలాల ఒప్పందాన్ని” నిలిపేసింది. రక్తం, నీరు కలిసి ప్రవహించదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. దీంతో పాకిస్థాన్‌లో భయం మొదలైంది. సింధు జలాల ఒప్పందంపై మిత్ర దేశాల సాయాన్ని కోరుతోంది. భారత్‌పై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తోంది. ఉగ్రవాదం ఆపేవరకు నీరు ఇవ్వమనే గట్టి నిర్ణయంపై భారత్ ఉంది.
1960లో ప్రపంచబ్యాంక్ మధ్యవర్తిత్వంతో భారత్-పాక్ మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం మూడు తూర్పు నదులపై భారత్‌కు, మూడు పశ్చిమ దేశాలపై పాకిస్థాన్‌కు హక్కులు కల్పించారు. వివాదాల పరిష్కారం కోసం శాశ్వత సింధు కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. అయితే, ఈ ఒప్పందాన్ని ఏకపక్షంగా నిలిపేసే అధికారం లేదని పాకిస్తాన్ వాదిస్తోంది. ఉగ్రవాదం ఆపే వరకు నీరు ఇచ్చేది లేదని భారత్ తెగేసి చెబుతోంది.

