ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ అవుతోంది. నిజానికి జూలై 9 రావాల్సింది. ప్రమోషన్లకు టైం తక్కువగా ఉండటంతో పాటు లెనిన్ కున్న బజ్ చూసి నిర్ణయం మార్చుకున్నారు. అది ఎంత పెద్ద ప్లస్ అయ్యిందో ఇప్పుడు కళ్ళముందు కనిపించింది. అఖిల్ దూకుడు ముందు జయకృష్ణ నిలవడం అంత సులభంగా ఉండేది కాదు. ఇవాళ ట్రైలర్ లాంచ్ చేసి కథేంటో చెప్పే ప్రయత్నం చేశారు.
తిరుపతిలో సరదాగా తిరుగుతూ జీవితాన్ని జాలీగా గడిపే ఒక మధ్యతరగతి కుర్రాడు (జయకృష్ణ) తొలిచూపులోనే ఓ అమ్మాయి (రశ తదాని)ని ఇష్టపడి ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. అయితే బళ్లారికి చెందిన ఫ్యాక్షనిస్టు వెంకటప్పయ్య (మోహన్ బాబు) ఎంట్రీతో వీళ్ళ లవ్ స్టోరీ హింసాత్మక మలుపు తీసుకుంటుంది. ఎంతగా అంటే చావు అంచుల దాకా ఆ ప్రేమ జంట వెళ్లేంత. అసలు వీళ్ళ మధ్యలో అతను ఎందుకు వచ్చాడు, రెండు ఊళ్ళ మధ్య ఉన్న లింక్ ఏంటనేది తెరమీద చూడాలి.
విజువల్స్, మేకింగ్ గట్రా చూస్తుంటే ఇంటెన్స్ లవ్ స్టోరీగా దర్శకుడు అజయ్ భూపతి దీన్ని రూపొందించిన వైనం కనిపిస్తుంది. జయకృష్ణ, రషా తదాని ఇద్దరూ కొత్తవాళ్లే అయినా మంచి ఈజ్ తో కనిపిస్తున్నారు. జయకృష్ణ యాక్టింగ్ స్కిల్స్ గురించి అవగాహన రావాలంటే మొత్తం సినిమా చూశాక కానీ చెప్పలేం. జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చిన ఈ వయొలెంట్ లవ్ స్టోరీలో వాసుకి, నరేష్, బ్రహ్మాజీ, అజయ్ లాంటి సీనియర్ ఆర్టిస్టులు చాలానే ఉన్నారు.
మహేష్ బాబు రాజకుమారుడు విడుదలైన తేదీ జూలై 30న వస్తున్న శ్రీనివాస మంగాపురం హిట్ కావడం ఆ ఫ్యామిలీకి కీలకం. ఎందుకంటే భౌతికంగా దూరమైన రమేష్ బాబు హీరోగా అందుకోలేని ఎత్తులు ఆయన కొడుకు అందుకుంటాడనే ఆశతో మంచి బడ్జెట్, సెటప్ దీని కోసం నిర్మాతలు అశ్వినీదత్, కిరణ్ భారీగా ఖర్చు పెట్టారు. ఈ నెల చివరి వారంలో మహేష్ బాబు ముఖ్య అతిథిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే వివరాలు ప్రకటించబోతున్నారు.

