జనగాం: జనగామ జిల్లాలో మద్యం మత్తులో ఓ వ్యక్తి చేసిన నిర్వాకం కలకలం రేపింది. జనగామ ఆర్టీసీ బస్టాండ్లో నిలిపి ఉంచిన అద్దె బస్సును ఎవరికి తెలియకుండా స్టార్ట్ చేసి తీసుకెళ్లాడు. సుమారు 21 కిలోమీటర్లు బస్సును నడిపించి చివరకు ప్రమాదానికి దారితీసింది. ఈ ఘటనతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
పోలీసుల వివరాల ప్రకారం.. అద్దె బస్సు డ్రైవర్ వాహనంలోనే తాళాలు వదిలేసి ఇంటికి వెళ్లాడు. ఇదే అవకాశంగా భావించిన పాలకుర్తి మండలం చెన్నూరుకు చెందిన డోజర్ డ్రైవర్ జిట్టబోయిన వెంకన్న మద్యం మత్తులో బస్సును స్టార్ట్ చేసి అక్కడి నుంచి సూర్యాపేట వైపు తీసుకెళ్లాడు. జనగామ నుంచి బస్సును నడిపిస్తూ వెళ్లిన వెంకన్న, దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి టోల్గేట్ సమీపంలోకి చేరుకున్నారు. అక్కడ అదుపు తప్పి సిమెంట్ దిమ్మెను బస్సు ఢీకొట్టింది. ప్రమాదాన్ని గమనించిన టోల్గేట్ సిబ్బంది అనుమానంతో వెంటనే దేవరుప్పుల పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న దేవరుప్పుల పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని నిందితుడు వెంకన్నను బస్సుతో సహా అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతడిని జనగామ పోలీసులకు అప్పగించారు. బస్సు అద్దె యజమాని గంట గోపికృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు జనగామ సీఐ సత్యనారాయణరెడ్డి కేసు నమోదు చేశారు. నిందితుడు మద్యం మత్తులోనే బస్సును ఎత్తుకెళ్లాడా.? ఘటనకు దారితీసిన పూర్తి పరిస్థితులు ఏంటి.? అనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

