Indian Army: భారత రక్షణ రంగం పాశుపతాస్త్రాన్ని సిద్ధం చేసింది. ఇప్పటికే ప్రపంచంలో అత్యంత శక్తివంతంగా గుర్తింపు పొందిన ఇడియన్ ఆర్మీ చేతిలోకి ఇది రావడంతో మరింత బలం చేకూరినట్లయింది. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ‘పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ (పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ – LRGR) ను విజయవంతంగా పరీక్షించారు. దీనితో భారత సైన్యం దీర్ఘదూర దాడి సామర్థ్యం మరింత బలోపేతమైంది. అయితే ఇది ఎలా తయారైంది? దీని వల్ల సైన్యానికి ఎటువంటి ఉపయోగం?
ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR)లో జూలై 8, 2026న నిర్వహించబడిన ఈ పరీక్షలో రాకెట్ నిర్దేశించిన 60 సంవత్సరాల కనిష్ఠ దూరాన్ని అత్యంత కచ్చితత్వంతో చేరుకుని ఛేదించింది. పరీక్ష సందర్భంగా ప్రయోగించిన పినాకా ఎల్ఆర్జీఆర్ ముందుగా నిర్దేశించిన మార్గాన్నే అనుసరిస్తూ ఎలాంటి వ్యత్యాసం లేకుండా ప్రదర్శించింది. చివరికి లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో తాకింది. రాకెట్ గైడెన్స్, నావిగేషన్, కంట్రోల్ వ్యవస్థలు అద్భుతంగా పనిచేశాయని ఈ పరీక్ష మరోసారి నిరూపించింది.
పినాకా ఎల్ఆర్జీఆర్ను డీఆర్డీవో (DRDO) ఆధ్వర్యంలో అభివృద్ధి చేశారు. పూణెలోని ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (ARDE), హై ఎనర్జీ మెటీరియల్ రీసెర్చ్ లాబొరేటరీ (HEMRL)లు ఈ రాకెట్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించాయి. అలాగే హైదరాబాద్లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లాబొరేటరీ (DRDL), రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (RCI) గైడెన్స్, నావిగేషన్, నియంత్రణ వ్యవస్థలకు అత్యాధునిక సాంకేతిక సహకారం అందించింది.
పినాకా ఎల్ఆర్జీఆర్ సాధారణ రాకెట్ కాదు. ఇది లక్ష్యానికి చేరుకునేంతవరకు తన దిశను సరిచేసుకుంటూ నిద్రే గైడెడ్ రాకెట్. అందువల్ల శత్రు కమాండ్ సెంటర్లు, బంకర్లు, వ్యూహాత్మక స్థావరాలు కీలక లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ధ్వంసం చేయగలదు. తక్కువ సమయంలో భారీ అగ్నిశక్తిని ప్రదర్శించగల సామర్థ్యం దీనికి ప్రత్యేకత.
ఈ విజయవంతమైన పరీక్షతో భారత సైన్యానికి అత్యాధునిక ఆయుధ వ్యవస్థ మరోటి అందుబాటులోకి రానుంది. సరిహద్దు భద్రత, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు, యుద్ధ సమయంలో వేగవంతమైన ప్రతిస్పందనకు ఈ రాకెట్ కీలకంగా ఉపయోగపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత భూసేన అగ్నిశక్తిని మరింత పెంచడంలో పినాక కీలక పాత్ర పోషించనుంది. ఈ పరీక్ష స్వదేశీ రక్షణ తయారీ సామర్థ్యానికి మరో నిదర్శనంగా నిలిచింది. విదేశీ ఆయుధాలపై ఆధారపడకుండా అత్యాధునిక రాకెట్ వ్యవస్థలను దేశీయంగా అభివృద్ధి చేయగల సామర్థ్యం భారత్కు ఉందని ఈ పరీక్ష మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. రక్షణ రంగంలో స్వావలంబన లక్ష్యానికి ఇది మరింత బలాన్ని చేకూర్చనుంది.
పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ విజయవంతమైన పరీక్షతో భారత్ ఆధునిక రాకెట్ సాంకేతికతలో మరో కీలక అడుగు వేసింది. ఖచ్చితత్వం, దీర్ఘదూర దాడి సామర్థ్యం, స్వదేశీ అభివృద్ధి వంటి అంశాల్లో ఈ వ్యవస్థ భారత రక్షణ రంగానికి కొత్త బలాన్ని అందించనుంది. భవిష్యత్తులో మరిన్ని అత్యాధునిక ఆయుధ వ్యవస్థల అభివృద్ధికి ఇది మార్గదర్శకంగా నిలుస్తుందని రక్షణ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

