Published on: 5:27 am, 22 మే 2026
మా మంచి ఎమ్మెల్యే- ఈ మాట చాలా తక్కువ నియోజకవర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వంపై ప్రజల సంతృప్తి – అసంతృప్తి ఎలా ఉన్నా.. క్షేత్ర స్థాయిలో ఎమ్మెల్యేలపై మాత్రం భిన్నంగా ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై నిప్పులు చెరుగుతున్న ప్రజలు కనిపిస్తున్నారు. మరికొన్ని చోట్ల చాలా అంటే.. చాలా తక్కువగా.. ప్రజలు ఎమ్మెల్యేలపై సానుకూల ధోరణితోనే ఉన్నారు. ఈ ధోరణిని ఎమ్మెల్యేలు .. వచ్చే ఎన్నికల వరకు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.
ఉదాహరణలు ఇవి..
ఉమ్మడి కృష్ణా, గుడివాడ నియోజకవర్గంలో మా మంచి ఎమ్మెల్యే అనే మాట తరచుగా వినిపిస్తోంది. ప్రభుత్వ పథకాలు అందని వారు కూడా.. ఎమ్మెల్యేపై పన్నెత్తు మాట అనడం లేదు. ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో వెనిగండ్ల రాము విజయం దక్కించుకున్నారు. ఇటీవల కొన్ని సంస్థలు సర్వే చేయగా.. సర్కారు నుంచి పథకాలు అందడం లేదని చెప్పిన వారు కూడా.. ఎమ్మెల్యే పనితీరును మెచ్చుకున్నారు. ఆయన బాగానే చేస్తున్నారని.. 80 శాతం మంది చెప్పారు. ఆయన దేవుడు అంటూ.. 50 శాతం మంది చెప్పారు.
గుంటూరు జిల్లా వెస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే గళ్లా మాధవికి కూడా నియోజకవర్గం లో మంచి టాక్ వినిపిస్తోంది. ఆమె పనితీరు పట్ల 90 శాతం మంది సానుకూలంగా ఉన్నారని ఆన్లైన్ సర్వేలు చెబుతున్నాయి. ఇక్కడ కూడా.. ప్రభుత్వ పథకాలు అందడం లేదని చెప్పిన వారు ఎక్కువగానే ఉన్నారు. అయినా.. కూడా ఎమ్మెల్యే వ్యవహారంపై ఎవరూ విమర్శలు చేయకపోగా.. ఆమె అందరికీ అందుబాటులో ఉంటున్నారని.. పిలిస్తే పలుకుతున్నారని చెబుతున్నారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలోనూ ఇదే మాట వినిపిస్తోంది. ఇక్కడ ఎమ్మెల్యే తరచుగా పర్యటించడం లేదన్న వాదన పార్టీ నాయకుల నుంచి వినిపిస్తున్నా.. ప్రజలు మాత్రం.. తాము ఎమ్మెల్యే ఇంటికి వెళ్లినా.. ఫోన్లు చేసినా.. స్పందన బాగుందని అంటున్నారు. ఇలా.. కొన్ని నియోజకవర్గాల్లో పనితీరు బాగుందన్న సంకేతాలు వస్తున్నాయి. అయితే.. ఈ వాదాన్ని.. ప్రజలలో నెలకొన్న సంతృప్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఎమ్మెల్యేలపై ఉంటుంది.

