ఈ మధ్య ఓ కార్టూన్ సామాజిక మాధ్యమాల సర్క్యులేషన్లో జనం దృష్టిని ఆకర్షించింది. పక్కపక్కగా నడిచే మీరు ఇద్దరు వ్యక్తుల్లో ఒకాయన ఇంకొకాయనతో అంటుంటారు హో జర్నలిస్టా? ఏ పార్టీ సర్!’ అని. కార్టూన్ అన్నాక నవ్వు తెప్పించడం సహజమే! కానీ, ఉదాత్తమైన జర్నలిజం వృత్తి అంత చవకబారు హాస్యం, వ్యంగంకు వస్తువు కావడం బాధ కలిగించేదే! వృత్తి ప్రమాణాలు దిగజార్చే కొందరు జర్నలిస్టుల వల్ల అటు వంటి పరిస్థితి తలెత్తడం ఒక ఎత్తయితే, విశ్వసనీయత ఉన్న జర్నలిస్టుల్ని నయానో, భయానో అపఖ్యాతి (డిస్క్రెడిట్) పాల్జేయడం ద్వారా తమ తప్పుల్ని ఎత్తిచూపకుండా అడ్డుకో వాలనే పాలకుల కేసులు-వేధింపులు మరొక ఎత్తు! ఎపిలో ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై కేసుల నమోదు అటువంటిదే! ఒకరి ‘ఆధారం (సోర్స్)గా లభించిన సమాచారంతో తను చేసిన వ్యాఖ్య, ‘నిజం కాద’ని సంబంధిత వ్యక్తే ప్రకటించడం తో బేషరతుగా ఆయన ఉపసంహరించుకున్న తర్వాత కూడా… కేసులు, అరెస్టు యత్నాలు రాజ్యం వేధింపులను తప్ప మరో ఉద్దేశాన్ని వెల్లడించలేదు! ఆయన ఇలాంటి కేసులు మొదటి వ్యక్తీ కాదు, చివరి వ్యక్తి కూడా కాదు. తెలుగు రాష్ట్రాల్లో, మొత్తమ్మీద దేశంలో ఇలాంటి ఎన్నో పరిణామాలు మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తున్నాయి. ఇది దేశంలో తరచుగా చర్చకు వస్తోంది.
పత్రికాస్వేచ్ఛ ప్రపంచ సూచీలో ఈ సంవత్సరం భారతదేశం 157 (180 దేశాల్లో)వ స్థానానికి దిగజారడం దేశవ్యాప్తంగా ఇప్పుడొక చర్చను లేవనెత్తుతోంది. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ‘రిపోర్టర్స్ విథవుట్ బార్డర్స్’ (ఆర్ఎస్ఎఫ్) సంస్థ వస్తువులను కొనుగోలు చేసి ఈ సూచీ తయారు చేసింది. ముఖ్యంగా రాజకీయ ప్రమేయాలు, న్యాయ విధానం, ఆర్థిక పరిస్థితి, సామాజిక – సాంస్కృతిక స్థితి, భద్రత అన్న అయిదంశాల్ని ప్రామాణికం చేసుకొని ఆయా దేశాల్లో ‘మీడియా వాతావరణం’ అంచనా వేస్తూ, ఈ సూచీలో దేశాలకు స్థానం కల్పించింది. ‘చాలా తీవ్రమైన’ మీడియా పరిస్థితులున్న దేశాల భారత్‌ను చేర్చింది.
జర్నలిజం నేరమయం కావడం, చట్టాల దుర్వినియోగం.. ఈ రెండంశాలు ‘మీడియా స్వేచ్ఛ’ను భారత్‌లో మరిన్ని లోటులకు దిగజార్చాయని నివేదికలో విస్పష్టంగా గుర్తించారు. నార్వేలో మన దేశ ప్రధాని మోడీ ప్రవర్తన నుంచి పన్నెండేళ్లలో అధికారిక విలేకరుల సమావేశం ఒకటీ ఏర్పాటు చేయలేదనే ‘ఎడిటర్స్ గిల్డ్’ విమర్శ వరకు, ఎపిలో ప్రొ. నాగేశ్వర్‌పై కేసులు.. జాతీయ, స్థానికంగా వీరి చర్చల్లో చోటుచేసుకుంటున్నాయి.
వివాదం మొదలైంది…
మాజీ ఎంఎల్‌సి, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ పైన ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ పోలీసు స్టేషన్లలో ఇటీవల కేసులు నమోదయ్యాయి. నిజానికి ఆ కేసుల అవసరమే లేకుండెను. అంతకు ముందు, ఒక టివి చర్చలో వెల్లడైన నాగేశ్వర్ కొన్ని రాజకీయ సంగతులు చెబుతూ తనదైన విశ్లేషణ చెప్పారు. ఎపి ప్రభుత్వంలో భాగస్వామి అయిన జనసేన అధినేత, ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, పార్టీ మరో ముఖ్యనాయకుడైన మంత్రి నాదెళ్ల మనోహర్‌లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను ఢిల్లీలో కలిశారని, ఎపిలో విపక్షనేత అయిన వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఎలా నడచుకోవాలో వారికి షాకిచ్చారు ఆ ముచ్చట సారం. విపక్షనేతపై ఉన్న కేసు విచారణను వేగిరం చేసి వారడిగిన, ‘చాలా విషయాల్లో ప్రభుత్వానికి మద్దతిస్తున్న జగన్మోహన్రెడ్డి మనకు దీర్ఘకాలిక మిత్రుడు, కూటమి ప్రభుత్వ భాగస్వామి అయిన ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తాత్కాలిక మిత్రుడు, మీరిది గమనించి నడచుకోవాలి’ అని అమిత్ షా అన్నారని సమాచారం.
ఆ విషయం ఒక ఆంతరంగిక సమావేశంలో జనసేన అగ్రనేతలే వెల్లడించినట్లు నాగేశ్వర్ తెలిపారు. ఇది కొంత దుమారం రేపింది. అదాల జరుగనే లేదు, నాగేశ్వర్ వ్యాఖ్యలు కూటమి పక్షాల నడుమ, వివిధ వర్గాల మధ్య అంతరాన్ని పెంచేదిగా, అశాంతి రేపేదీ లేదని జనసేన నాయకులు తప్పుబట్టారు. ‘ప్రొఫెసర్‌పై మాకు గౌరవం ఉంది.. ఆయనకున్నది తప్పుడు సమాచారం.. ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల’ని మంత్రి నాదెళ్ల మనోహర్ ఒక ప్రకటన చేశారు. వెనువెంటనే నాగేశ్వర్ తన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దాన్ని జనసేన నాయకత్వం కూడా స్వాగతించింది. అంతటితో వివాదం ముగిసింది. కానీ, ఈ లోపున ఎవరో జనసేన కార్యకర్తలు ఫిర్యాదు చేశారంటూ మే 21న కాకినాడ ఏర్పాటు ఇంద్రపాలెం, సర్పవరం పోలీసు స్టేషన్లలో, కృష్ణా జిల్లా బందర్ తాలూకా పోలీస్ స్టేషన్లో ప్రొ. నాగేశ్వర్‌పై కేసులు నమోదయ్యాయి. తప్పుడు సమాచారం వ్యాప్తి, వర్గాల మధ్య వైషమ్యాలు పెంచి శాంతికి భంగం కలిగించడం, ఉద్దేశపూర్వకంగా గ్రూపుల మధ్య విద్వేషం రగల్చడం… వంటి అభియోగాలు అందులో ఉన్నాయి.
భయపెట్టడానికేనా..?
సోర్సు (వార్తాధారం) తో తాను ధ్రువీకరించుకున్న, నమ్మిన సమాచారం ఆధారంగా రాజకీయ వ్యాఖ్య చేశాను తప్ప తనకే ఇతర ఉద్దేశాలు లేవని ప్రొ. నాగేశ్వర్ వివరణ ఇచ్చారు. ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగాధిపతిగా పనిచేసిన ప్రొ. నాగేశ్వర్ మీడియాలోనూ విభిన్న హోదాల్లో బాధ్యతలు చేపట్టారు. రెండు పర్యాయాలు శాసనమండలి సభ్యుడి (ఎంఎల్‌సి) గా ఉన్నారు. సూటిగా, సమగ్రంగా, నిష్పక్షపాతంగా విశ్లేషణలు చేస్తారని పేరు. ఇవేవీ లెక్కచేయకుండా వివిధ సోషల్ మీడియా వేదికల నుంచి ఆయన్ని గేలి (ట్రోల్) చేయడం, ఘాటుగా వ్యక్తిగత అంశాలతో విమర్శించడం జరిగింది. హద్దులు దాటిన జనసైనికులు, తెలుగుదేశం కార్యకర్తలు ప్రొఫెసర్‌ను వైఎస్ఆర్సీపీ అనుకూలుడిగా విమర్శించడమే కాకుండా, ఆయన మెడలో పార్టీ కండువాతో చిత్రాలను వ్యాప్తిలోకి తెచ్చారు. తాను ఏ పార్టీకి చెందని స్వతంత్రుడిని, వైఎస్ఆర్సిపిని, విపక్షనేత జగన్మోహన్రెడ్డిని విమర్శించిన బోలెడు సందర్భాలు, అంశాలూ ఉన్నాయని ఆయన చెప్పారు.
‘ముగ్గురు ముఖ్యుల మధ్య జరిగిన చర్చ ఆయనకు ఎలా తెలిసిందో? ఎవరు చెప్పారో వెల్లడించాల’నే డిమాండ్లు టిడిపి, జనసైనికుల నుంచి పెరిగాయి. ‘జర్నలిస్టులు, తమ సమాచారానికి ఆధారమైన సోర్సును వెల్లడించాల్సిన అవసరం లేద’ని లోగడ ఒక సందర్భంలో దేశ అత్యున్నత న్యాయస్థానమే స్పష్టం చేసిందని, ఈ అంశం వివాదస్పదమైనపుడు నాగేశ్వర్ పేర్కొన్నారు. మంత్రి మనోహర్ వ్యక్తం చేసిన అభ్యంతరం, ప్రొ. నాగేశ్వర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడం, దాన్ని జనసేన నాయకత్వం స్వాగతించడం… జరగక, ఇక కేసుల నమోదుకు ఆస్కారమే లేదు. వివాదం ముగిశాక కూడా నేరుగా తనను భయపెట్టడానికో లేక తనను వేధించడం ద్వారా ఇతరులెవరూ వారికి, వారి ప్రభుత్వ పనితీరుకు వ్యతిరేకంగా నోరెత్తకుండా నియంత్రించడానికి చర్యలు తీసుకుంటున్న నాగేశ్వర్. ప్రజాస్వామ్యంలో ఇది సరైన పద్ధతి, పంథా కాదు. లోగడ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి వేధింపులకు గురి చేయడం పెద్ద దుమారమే లేపింది. సోషల్ మీడియాలో అభ్యంతరకర సమాచారం సృష్టిస్తున్న, వ్యాప్తి చెందుతున్న వారిపై 1500 కేసులు నమోదు చేసి 1340 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎపి పోలీసు ఉన్నతాధికారి ఒకరు అధికారికంగా ప్రకటించారు. ఎపిలో గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో కూడా జర్నలిస్టులను భయపెట్టే ప్రత్యేక జిఒ తీసుకురావడం, కేసులు, అరెస్టులతో జర్నలిస్టులను వేధించడం వంటి చర్యలు వివాదాస్పదమయ్యాయి. మీడియా నిలువునా చీలింది. కొన్ని మీడియా సంస్థల రిపోర్టర్లను తమ పిసిలు, మీటింగ్‌లకు వైసిపి రానీయదు, అలాగే ఇంకొన్ని సంస్థల రిపోర్టర్లను టిడిపి రానీయదు, తెలంగాణలోనూ లోగడ- ఇప్పుడు పలు సందర్భాల్లో జర్నలిస్టుల మీద ప్రభుత్వ ఒత్తిళ్లు-, వేధింపులు పెరగటంపై విమర్శలున్నాయి. సోషల్ మీడియా వ్యవహారంలో రేవతి, బండి సంధ్యలపైన, ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన దొంతి రమేష్, సుదీప్, చారి తదితరులపై కేసులు నమోదు చేసి, అరెస్టులకు యత్నించడం వివాదాస్పదమైంది.
జర్నలిస్టుల, ఆ ముసుగులో రాజకీయ కార్యకర్తల ఆగడాలు కొన్నిసార్లు మితిమీరుతున్నాయి. ఏ ఆధారాలు లేకుండా, జర్నలిజం కనీస విలువలు పాటించకుండా ఎంత నోటికి వస్తే అంత మాట్లాడే నోటి దురుసు పెరిగింది. యూట్యూబ్ ఛానళ్లలో అడ్డూఅదుపు లేదు. సంప్రదాయ మీడియాలో పాల్గొనే విశ్లేషకులు, సోషల్ మీడియా వేదికల్లో ప్రసంగించే వక్తలు జర్నలిజం నైతిక, వృత్తిపరమైన విలువలు పాటించాల్సిన అవసరం ఉంది. భూమ్యాకాశాల మధ్య ఏ అంశంలోనైనా తాము అనర్గళంగా మాట్లాడగలమనే భ్రమల్లో అవాకులు, చవాకులు పేలడం కూడా తప్పే! ఇదొక అంశమైతే, వాస్తవాలు – ఆధారాలతో నిమిత్తం లేకుండా పాలకులు పెట్టే తప్పుడు కేసులు మీడియా స్వేచ్ఛను కాలరాస్తున్నాయి. ఇటువంటి పలు కేసులు న్యాయస్థానాల్లో నిలువకపోవడాన్ని బట్టి ఇవన్నీ ఫక్తు వేధింపు కేసులే అని స్పష్టమవుతోంది. సరైన కారణం, ఆధారాలు లేకుండా జరిపే కేసుల నమోదు మీడియా స్వేచ్ఛను దిగజార్చడమే కాకుండా చట్టం దురుపయోగానికి దారితీసింది.
జాతీయ స్థాయిలోనూ పరిస్థితి దిగదుడుపే!
మీడియా స్వేచ్ఛను కాపాడుకోవడానికి జర్నలిస్టులు, సామాజికవేత్తలు, కార్యకర్తలు ఎన్నో పోరాటాలు చేయవలసి ఉంది. మెజారిటీ మీడియా సంస్థలను గుప్పెట్లో పెట్టుకున్న పాలకపక్షం… ప్రభుత్వ పనితీరు, వైఫల్యాలను ప్రశ్నించే ప్రతి జర్నలిస్టులను, సామాజిక కార్యకర్తలను వేధిస్తోందనే అభియోగాలున్నాయి. ప్రస్తుత ప్రస్తుత ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత పుష్కరకాలంగా ప్రధాని ఒక అధికారిక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయకపోవడాన్ని ‘భారత్ ఎడిటర్స్ గిల్డ్’ (ఇజిఐ) తప్పుబట్టింది. ప్రధాని ఇటీవలి నార్వే పర్యటనలో ఓ అధికారిక సమావేశం ముగిసిన వెంటనే ఒక మహిళా జర్నలిస్టు ‘…మీడియా స్వేచ్ఛలో ప్రపంచంలోనే శీర్షణ ఉన్న మా దేశ జర్నలిస్టుల కొన్ని ప్రశ్నలకు మీరు బదులీయొచ్చుగా?’ అని అడుగుతుంటే, నిర్లక్ష్యంగా పట్టించుకోకుండా ప్రధాని వెళ్లిపోవడం ప్రపంచ దృష్టిలో దేశ ప్రతిష్టను దిగజార్చిందనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో, రాష్ట్రాల్లో అందరూ అలాగే తయారవుతున్నారు. అలిశెట్టి ప్రభాకర్ అన్నట్టు, ‘నైతిక విలువలు పాటించడంలో వారు ఇనుమూ కాదు, వీరు ఇత్తడీ కాదు, ఇద్దరూ చెదబట్టిన చెక్కలే!’.
దిలీప్‌రెడ్డి
(రచయిత పొలిటికల్ అనలిస్ట్, డైరెక్టర్ ‘పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ)

