కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్ తగిలింది. రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచిన మీనాక్షి నామినేషన్ ను తిరస్కరించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి మీనాక్షితో పాటు మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు. నామినేషన్ల గడువు ముగిసిన నేపథ్యంలో ఇక మీనాక్షి రాజ్యసభకు వెళ్లడం దుస్సాధ్యమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మధ్యప్రదేశ్ కోటాలో మూడు రాజ్యసభకు ఎన్నికలు జరగనుండగా… అధికార బీజేపీ ముందుగా రెండు స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసింది. మిగిలిన ఒక రాజ్యసభ సీటును దక్కించుకున్న సంఖ్యలో ఎమ్మెల్యేలను కలిగిన కాంగ్రెస్… ఆ సీటును మీనాక్షికి ఇచ్చింది. అయితే చివరాఖరులో రెండు సీట్లను దక్కించుకున్న తర్వాత కూడా తమ వద్ద మరింత మంది ఎమ్మెల్యేలు ఉన్నారనే వాదనతో బీజేపీ మూడో సీటుకూ అభ్యర్థిని ఖరారు చేయగా… మొత్తంగా మూడు సీట్లకు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి.
ఈ మీనాక్షి ఎన్నికకు పోలింగ్ తప్పనిసరి అన్న వాదనలు వినిపించగా… మంగళవారం నామినేషన్ల సందర్భంగా ఆమె నామినేషన్ పై బీజేపీ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసింది. మీనాక్షి తన కేసుల వివరాలను అఫిడవిట్లో పొందుపరచలేదన్న బీజేపీ ఫిర్యాదును పరిశీలించిన రిటర్నింగ్ అధికారి… మీనాక్షి నామినేషన్లో కేసుల వివరాలు లేవని తేల్చారు. దీంతో ఆమె నామినేషన్ ను చెల్లనిదిగా పేర్కొంది. ఈ అనూహ్య పరిణామంతో మీనాక్షితో పాటు కాంగ్రెస్ పార్టీ షాక్ తిన్నది.
అయితే ఇతరత్రా వివరాలను పక్కనపెట్టేసిన కాంగ్రెస్ నేతలు… బీజేపీ ఫిర్యాదు చేస్తే తమ అభ్యర్థి నామినేషన్ ను తిరస్కరిస్తారా? అంటూ రిటర్నింగ్ అదికారి తీరుపై విరుచుకుపడ్డారు. అలాగే రిటర్నింగ్ అధికారిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు పార్టీ సీనియర్లు కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్ ఢిల్లీలోని ఈసీ కార్యాలయానికి వెళ్లారు.
ఈ సమాచారం అందుకుంది… పోలీసులు వారిని ఈసీ ఆఫీసు గేటు వద్ద అడ్డుకుని వారిని కార్యాలయం లోపలికి అనుమతించలేదు. తన నామినేషన్ తిరస్కరణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మీనాక్షి.. ఈ తరహా చర్యలతో బీజేపీ వైఖరి ఏమిటని తేలిపోయిందని, ఏకపార్టీ పాలనను ఆ పార్టీ బలవంతంగా రుద్దుతున్నదని అన్నారు.

