కేరాఫ్ కంచరపాలెం చిత్ర దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కించిన సినిమా రావు బహదూర్. సత్యదేవ్ లీడ్ రోల్ చేసిన ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు సమర్పించడంతో ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. శుక్రవారం విడుదలైన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం.
కథ: ఘన చరిత్ర ఉన్న జమీందారు కుటుంబానికి చెందిన రామ్ దేవ్ (సత్యదేవ్).. తన ఇద్దరు కొడుకుల్లో చిన్నవాడైన కుసుమ మరణించిన దగ్గరి నుంచి మానసిక సమస్యలతో బాధ పడుతుంటాడు. ఎన్నో ఏళ్ల పాటు తన గదికే అతను పరిమితమైపోతాడు. క్యాన్సర్ బారిన పడ్డాక కూడా అతను ప్రాణాలు కోల్పోకుండా తనలో మెదిలిన ఒక అనుమానం పెనుభూతమై మనోవేదన అనుభవిస్తుంటాడు. రామ్ దేవ్ పెట్టే ఇబ్బందులతో కుటుంబ సభ్యులతో పాటు పని వాళ్లూ నానా పాట్లు పడుతుంటారు. రామ్‌దేవ్ ఆప్త మిత్రుడైన వైద్యుడికీ ఈ తలనొప్పి తప్పదు. రామ్ దేవ్ సమస్య పరిష్కరించడం కోసం వైద్యులు- కుటుంబ సభ్యులు ఒక వైపు ప్రయత్నం చేస్తుంటే.. ఇంకోవైపు అతను ఒక కేసులో చిక్కుంటాడు. ఇంతకీ ఆ కేసు ఏంటి.. రామ్ దేవ్ గతమేంటి.. తన మానసిక సమస్యకు మూలమేంటి.. అతడిలో మెదిలిన అనుమానమేంటి.. చివరికి అతడి అనుమానం తీరిందా.. ఈ ప్రశ్నలన్నింటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.

