వేల యేళ్ల కిందటే ఈ మట్టి మీద
శాంతి దీపాలను వెలిగించిన వాడు
సమానత్వ సూత్రాలతో జనాలను కూడగట్టిన వాడు
శాస్త్రీయత పునాదుల మీద ఆలోచనల అంటుకట్టిన వాడు
బుద్ధునంతటి వాని పాదాలను మోసినందుకు
ఈ నేల నిజంగా మహోన్నతమైనదంటాను నేను
రాజ్యాల కోసం రక్తాలు పారుతున్న కాలంలో
ప్రజాస్వామ్య రాజ్యాన్ని గిజిగానిలా నిర్మించిన వాడు
బలాన్ని, బలగన్నీ ధర్మ యాగంలో
సమిధలుగా మార్చిన వాడు
దేశానికి తొవ్వను చూపి తన
ధర్మ చక్రాన్ని బహుకరించిన వాడు
పాలకుల పాలిటి నిఘంటువు అశోక చక్రవర్తి ఏలిన
నా భరత దేశం నిజంగా నాకు గర్వకారణమంటాను
నా దేశం మీద తెల్ల గ్రహణం కమ్ముకున్నప్పుడు
ముసిరిన చీకట్లను ప్రాణత్యాగ దీపాలతో పారదోలిన వాళ్ళు
ఒంట్లోని రక్తాన్ని ధారపోసిన,
దేశపు మట్టికి సింధూర తిలకం దిద్దిన వాళ్ళు
అన్నీ వదిలేసి దేశం కోసం విగ్రహాలై నిలుచున్న వాళ్ళు
స్వాతంత్య్ర వీరుల రక్తసిక్త దేహాలను ముద్దాడిన
ఈ నేలమ్మను నీళ్లు నిండిన కళ్ళతో ముద్దాడుతూనే ఉంటాను
వేల,వేల కులాలతో కుళ్ళిపోయిన సమాజాన్ని
తన మేధో జలంతో కడిగి శుభ్రపరచినవాడు
తన జాతి ప్రజల మేలుకొలుపు కోసం
కడుపు పంటను నిలువునా కాల్చేసుకున్న వాడు
రాజ్యాంగంతో దేశానికి వెన్నెముకనిచ్చిన వాడు
నేల మీద నడిచిన గ్రంధాలయం అంబేద్కర్ ను
కన్నందుకు నేనెప్పుడూ నా దేశానికి ఋణపడే ఉంటాను
– తోకల రాజేశం

