నీట్ పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష భగ్నం, కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమాలతో దేశ రాజధాని ఢిల్లీ అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంట్ ముట్టడికి సీజేపీ కార్యకర్తలు, యువత ప్రయత్నించడం…వారిపై లాఠీ ఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించడంపై కాంగ్రెస్ సహా బీజేపీ వ్యతిరేక పార్టీలు మండిపడుతున్నాయి. ఈ సందర్భంగానే ప్రధాని మోదీ నివాసాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు.
రాహుల్, ప్రియాంకాతోపాటు ఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తదితర నేతలు ప్రధాని నివాసం లోక్ కల్యాణ్ మార్గ్ వైపు వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ కోరనే రాహుల్, ప్రియాంక సహా కాంగ్రెస్ నేతలు రోడ్డుపై ధర్నాకు దిగారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీకి, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే, ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీ చేపట్టారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ప్రజాస్వామ్య హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని కాంగ్రెస్ నేతలు. ప్లాస్టిక్ ట్యాగ్ లతో చేతులను కట్టేసుకొని కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు.
విద్యార్థులపై జరిగిన దాడికి ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మోదీ, అమిత్ షా, ధర్మేంద్ర ప్రధానులు యువత భవిష్యత్తును నాశనం చేశారు, వారంతా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్‌పై పార్లమెంట్లో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. మరోవైపు, పోలీసుల లాఠీఛార్జ్‌లో గాయపడిన విద్యార్థులను రాహుల్, ప్రియాంక గాంధీ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.

