డీలర్‌పై క్రిమినల్ కేసు నమోదు
వ్యవసాయాధికారి సస్పెండ్
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టిలైజర్ యాప్యూరియా యాప్ ద్వారా పంపిణీలో జరుగుతున్న అక్రమాలను గుర్తించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం సాధ్యమైందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. సిద్దిపేట జిల్లాలో ఆరువేల యూరియా బస్తాలు మాయమైనట్టు యాప్ ద్వారా గుర్తించి, ఇద్దరు హోల్ సెల్ డీలర్లు, ఒక రిటైలర్ లైసెన్స్‌ను వ్యవసాయ శాఖ రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు. దీనితో పాటు విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వ్యవసాయశాఖ అధికారిని సస్పెండ్ చేశామని చెప్పారు.
అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో, ఒక సొసైటీ ప్లాస్టిక్ సరఫరాలో జరిగిన అక్రమాలను గుర్తించి, బాధ్యులపై చర్యలు తీసుకున్నట్లు మంత్రి వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఫర్టిలైజర్ యాప్ ద్వారా లావాదేవీలన్నీ పూర్తిగా డిజిటల్ పద్ధతిలో నమోదవుతున్నందున తప్పుడు ఎంట్రీలు, కల్పిత బిల్లులు, అక్రమ నిల్వలు, యూరియా మళ్లింపులను సులభంగా గుర్తించడం సాధ్యమైందని అన్నారు. భవిష్యత్తులో కూడా యూరియా అక్రమాలను ప్రభుత్వం ఏమాత్రం సహించదని, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయని, రైతుల ప్రయోజనాల పరిరక్షణలో ప్రభుత్వం రాజీపడదని, పంపిణీలో పారదర్శకత కోసం యూరియా యాప్‌ను అమలు చేస్తున్నామని మంత్రి వివరించారు. యూరియా పంపిణీని పూర్తిగా ఫర్టిలైజర్ యాప్ ద్వారా నిర్వహించడం వల్ల అక్రమదారులకు అన్ని మార్గాలు మూసుకుపోయాయని మంత్రి తెలిపారు.
రైతులకు సక్రమంగా అందాల్సిన యూరియాను ఎవరైనా అక్రమంగా పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతంలో యాప్ వ్యవస్థ లేకపోవడం వల్ల అసలైన రైతులకు చేరాల్సిన యూరియాను కొందరు అక్రమంగా ప్రైవేట్ సంస్థలకు విక్రయించి రైతులను మోసం చేసే పరిస్థితులు ఉండేవి, ఇప్పుడు అలాంటి అవకాశాలకు పూర్తిగా అడ్డుకట్ట పడి ఉన్నాయి. రైతులకు అందాల్సిన ఉత్పత్తులను దుర్వినియోగం చేయడానికి లేదా అక్రమాలకు ఇవ్వడానికి ఎవరికీ అవకాశం ఇవ్వబోమని మంత్రి వివరించారు.

