అనగనగా ఒక ఊరిలో ఒక రాజుండేవాడు. ఒకసారి ఆయన గుర్రాలకు దెబ్బలు తగిలాయి. వైద్యులు చికిత్స చేసినా తగ్గలేదు. దాంతో రాజుగారు రాజుగా పిలిచి, ఈ సమస్యకు పరిష్కారం ఏంటని అడిగాడు. ఏం చెప్పాలో తోచని ఆ వైద్యుడు “మహారాజా! కోతి మెదడు తెచ్చి గాయం మీద పెడితే గుర్రాల శరీరంలో వేడి తగ్గి, గాయాలు మానిపోతాయి” అని చెప్పాడు. దాంతో రాజు ఆ రాజ్యంలోని కోతుల్ని చంపి, వాటి మెదడు తీసుకురావాలని రాజ భటులను ఆజ్ఞాపించాడు. మహారాజు మాట విన్న భటులు చిక్కిన కోతినల్లా పట్టుకుని చంపడం మొదలుపెట్టారు. ఈ విషయం తెలిసిన ఒక ముసలి కోతి ఎంతో బాధపడింది. రాజు మీద ప్రతీకారం తీర్చుకోవడానికి సరైన టైం కోసం ఎదురుచూసింది. అలా కొన్ని రోజులు గడిచాక ఒక మంచి అవకాశం వచ్చింది.
ఒకరోజు కోతికి బాగా దాహం వేసింది. నీళ్ల కోసం అడవిలో తిరుగుతూ ఒక సరస్సు దగ్గరకు చేరింది. కానీ.. అది అక్కడ విషయం గమనించింది. దానిలాగే ఇతర జంతువులు కూడా ఆ సరస్సుకు నీళ్లు తాగడానికి వచ్చి, సరస్సు లోపలికి వెళ్లాయి. వాటి కాళ్ల గుర్తులు కూడా ఉన్నాయి. కానీ.. అవి బయటకి వచ్చిన గుర్తులు మాత్రం లేవు. దాంతో దానికి అనుమానం వచ్చింది. ప్రమాదం పొంచి ఉందని అర్థం చేసుకుంది. మరి దాహమేస్తుంది నీళ్లు తాగడం ఎలా ? అని ఆలోచించింది. వెంటనే దానికో ఆలోచన వచ్చింది. సరస్సులోకి దిగకుండా తామర తూడుతో నీళ్లు తాగింది.
ఆ సరస్సులో ఉన్న రాక్షసుడు కోతి తెలివికి మెచ్చి పైకి వచ్చి.. ‘భళా వానరా! భళా! నీ తెలివికి మెచ్చాను’ అన్నాడు. కోతి ఆ రాక్షసుడిని ఆశ్చర్యంగా చూసింది. రాక్షసుడి మెడలో ఒక హారం ధగధగ మెరుస్తోంది. దాన్ని చూడగానే కోతికి మరో ఆలోచన వచ్చింది. వెంటనే రాక్షసుడితో ‘నీ మెడలోని హారం నాకు ఇస్తే.. నీకు కావాల్సినంత ఆహారం ఇస్తాను’ అని చెప్పింది. అప్పటికే కోతి తెలివిని చూసిన రాక్షసుడు ‘సరే’ అని హారాన్ని తీసి ఇచ్చాడు.
రాక్షసుడు ఇచ్చిన హారాన్ని తీసుకుని, కోతి రాజధాని నగరానికి వెళ్లింది. అక్కడి జనం ఆ వజ్రాల హారాన్ని చూసి ఆశ్చర్యపోయారు. “కోతీ! నీకు ఈ హారం ఎలా వచ్చింది?” అని అడిగారు. “అడవిలో ఒక కొలను ఉన్నది. అందులో బోలెడన్ని తామరపూలు, ఇలాంటి హారాలు ఉన్నాయి. అక్కడికి వస్తే ఒక్కొక్కరికి ఒక్కో హారం ఇస్తాను” అంది కోతి.
ఈ మాట ఆ నోటా ఈ నోటా పడి మహారాజు వరకు చేరింది. తరువాతి రోజు తెల్లవారు జామునే మహారాజు తన పరివారాన్ని తీసుకుని కోతి వెంట సరస్సు దగ్గరకి వచ్చాడు. తామరపూలతో ఎంతో అందంగా ఉంది సరస్సు. కోతి దాన్ని చూపిస్తూ ‘ఈ సరస్సులో దిగితే వేలకొద్దీ హారాలు దొరుకుతాయి’ అని చెప్పింది. కోతి మాటలు నమ్మిన రాజు పరివారం అంతా ఒక్కసారిగా కొలనులోకి దిగింది. కానీ.. ఎంతసేపైనా లోపలికి వెళ్లిన వాళ్లలో ఒక్కరు కూడా తిరిగి ఒడ్డుకు రాలేదు. రాజు “కారణమేంట”ని కోతిని అడిగాడు.
అందుకు కోతి “నీవు మా జాతిని నాశనం చేశావు. నేను ప్రతీకారంగా మీ పరివారాన్ని చంపించాను. ఇక మీరు దయచేయొచ్చు” అని చెప్పి అక్కడి నుంచి పారిపోయింది. రాజు బుద్ధి తెచ్చుకుని నిశ్శబ్దంగా రాజధానికి తిరిగి వెళ్లిపోయాడు. కోతి వజ్రాల హారాన్ని తిరిగి రాక్షసుడికి ఇచ్చింది.
మూలం: విష్ణు శర్మ
తిరగరాసింది: అనిల్ బత్తుల

