సిట్ దర్యాప్తులో నిందితుల వెల్లడి
అయోధ్య: దేవుని సొత్తు దూతల పాలు. రాముని సొమ్ముతో షేర్లు, వడ్డీ వ్యాపారాలు. రామ మందిరంలో భక్తులు సమర్పించుకున్న విరాళాలను అడ¦దారిలో కొట్టేసిన నిందితులు ఆ సొమ్ముతో వడ్డీ వ్యాపారాలు చేశారు, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టారని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పరిశీలనలో వెల్లడైంది. స్నేహితులు, బంధువుల బ్యాంకు ఖాతాలోనూ జమ చేయడం ద్వారా కూడా అక్రమార్కులు తరలించినట్లు తెలిసింది. కీలక నిందితులైన అనుకల్ప్ మిశ్ర, లవకుశ్ మిశ్ర, కరుణేశ్ పాండేలను గత రెండు రోజులుగా వారి ఇళ్లకు తీసుకెళ్లి పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధువులనూ ప్రశ్నించారు. డబ్బు కట్టలు, బంగారు ఆభరణాలతో పాటు ఓ కారును అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. నిందితులకు చెందిన బంధువులు 30 బ్యాంకు ఖాతాలను జప్తు చేశారు. ఆయా ఖాతాల్లో భారీ మొత్తంలో నగదు జమ అయినట్లు పేర్కొన్నారు. అయోధ్య రామాలయంలో చోరీ చేసిన విరాళాల సొమ్ముతో వడ్డీ వ్యాపారం, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినట్లు అనుకల్ప మిశ్ర, సహ నిందితుడు అవినాశ్ వెల్లడించినట్లు తెలిసింది. అనుకల్ప మిశ్ర అయోధ్యలో ఏకరం భూమిని రూ.6.7 లక్షలకు కొనుగోలు చేసినట్లు పత్రాలు లభించాయి.
పోస్ట్ రామయ్య సొత్తుతో షేర్లలో పెట్టుబడులు మొదట కనిపించింది విశాలాంధ్ర.

