రిషికొండ పాలెస్లను వినియోగంలోకి తీసుకొచ్చే దిశగా ఎట్టకేలకు ఓ కీలక అడుగు అయితే.. సాగర నగరం విశాఖ పర్యాటక కేంద్రంగా ఇప్పటికే ఓ రేంజికి ఎదగగా… తాజాగా ప్రభుత్వం చేపడుతున్న చర్యల కారణంగా నగర పరిసరాలకు మరింత మేర పర్యాటక శోభ వస్తోంది. అందులో భాగంగానే రిషికొండ ప్యాలెస్‌లను ప్రైవేట్ వ్యక్తులకు లీజుకు ఇచ్చే దిశగా ప్రభుత్వం తొలి అడుగు వేసింది. ఈ తంతు త్వరగానే ముగిసి రెండేళ్లకు పైగా వినియోగంలో లేని ఈ భవనాలు వినియోగంలోకి రావడం ద్వారా ప్రభుత్వానికి కొంతమేర అయినా ఆదాయం వస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ భవన నిర్మాణాలకు గత ప్రభుత్వం ఖర్చు పెట్టిన వందల కోట్ల రూపాయల స్థాయిలో అయితే ఆదాయం వచ్చే పరిస్థితి లేదని చెప్పక తప్పదు.
వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా… మరోమారు తానే సీఎం అవుతానని కలలు గన్న ఆయన తన అధికార నివాసం కోసం రిషికొండను తవ్వి నిబంధనలకు విరుద్ధంగా రిషికొండ ప్యాలెస్ ను నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ భవనాల కోసం జగన్ సర్కారు ఏకంగా రూ.452 కోట్లు ఖర్చు చేసింది. అయితే జగన్ పాలన నచ్చని ఏపీ జనం… ఐదేళ్లకే జగన్ ను గద్దె దించారు. వెరసి రిషికొండ ప్యాలెస్ లోకి ఆయన అడుగు కూడా పెట్టలేకపోయారు. జగన్ తన కోసం నిర్మించుకున్న ఈ భవనాల వినియోగం ఆ తర్వాత వచ్చిన కూటమి సర్కారుకు పెను సవాల్ గానే మారింది. రెండేళ్ల పాటు ఈ భవనాలను ఏం చేయాలనే దిశగా ఆలోచించిన కూటమి ప్రభుత్వం తాజాగా ఈ భవనాలను ఆతిథ్య రంగంలోని సంస్థలకు లీజుకు ఇచ్చే దిశగా కీలక అడుగు వేసింది.
అత్యంత ఆధునిక సౌకర్యాలతో రాజ వైభోగం తలపించేలా జగన్ నిర్మించిన ఈ భవనాలను ఇదివరకే ఆతిథ్య రంగంలో పలు సంస్థలు పరిశీలించాయి. అయితే ఓ సీఎం కోసం నిర్మించుకున్న ఈ భవనాలను పర్యాటకంగా వినియోగించుకునేందుకు పనికి రావని ఆయా సంస్థలు తేల్చేశాయి. తాజాగా ఈ భవనాలను ఎలాగైనా వినియోగంలోకి తీసుకురావాలన్న దిశగా ఆలోచించిన ప్రభుత్వం.. ఈ భవనాలను లీజుకు తీసుకుంటే వాటికి ఆనుకుని ఉన్న ఖాళీ స్థలం కూడా లీజుకు ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ అడుగు ఫలితం ఇచ్చింది. రిషికొండ ప్యాలెస్ ఆపరేషన్, మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌కు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పర్యాటక సంస్థల నుండి ఆసక్తి వ్యక్తమైంది.
రిషికొండ ప్యాలెస్ దాని పరిసరాల్లోని భూముల లీజు, ఆ భూముల్లో ఇతరత్రా కట్టడాల నిర్మాణం, వాటి ఆపరేషన్లకు సంబంధించిన బిడ్లను జూలై 10న దాఖలు చేసేందుకు ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌కు మంచి స్పందన లభిస్తున్నదన్న వాదనలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ బిడ్లు ఏ మేర.. అంటే ఏ ధరకు ఆయా సంస్థలు రిషికొండ ప్యాలెస్‌లను అద్దెకు తీసుకుంటాయన్న విషయం ఆసక్తిగా మారింది. ఎంత ఎక్కువ ధర వచ్చినా కూడా రిషికొండ ప్యాలెస్ నిర్మాణ ఖర్చులో లేశమాత్రమే ఇప్పుడు వస్తుందని, ఇదే లీజు ఏళ్ల తరబడి కొనసాగితే తప్పించి.. వాటి నిర్మాణానికి అయ్యే ఖర్చు వెనక్కు రాదని చెప్పక తప్పదు. అయితే నిరుపయోగంగా ఉంటే.. ఈ మార్గం ద్వారా అయినా, ఏళ్ల తర్వాత అయినా ఈ నిధులు సర్కారీ ఖజానాకు చేరడం మంచిదే కదా.

