తెలంగాణ పాలిట రేవంత్ రెడ్డి మొనగాడు కాదని మోసగాడని మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల సంక్షేమం పేదల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసింది గుండు సున్నా అన్నారు. ఎల్ఐసి కి ప్రీమియం చెల్లించిన 7600 మంది రైతులకు రైతు బీమా ఆగిపోయింది. ఎకరాకు 15 వేల రూపాయలు అధికారంలోకి వచ్చిన డిసెంబర్ 9న వేస్తామని చెబితే ప్రజలు మోసపోయి ఓటు వేశారని హరీష్ రావు అన్నారు. అధికారంలోకి వచ్చిన రెండున్నర ఏళ్లలో మూడు పర్యాయాలు రైతు భరోసాను ఎగ్గొట్టారని హరీష్ రావు. ఎకరానికి 15000 ఇచ్చాడు ఏమో కానీ ఉన్నవి రాకుండా పోయానని ఆయన సీఎం తీరును ఉద్దేశించి ఎద్దేవా చేశారు.
రైతు పండించిన వరి, మొక్కజొన్న, సోయా వంటి పంటలకు అన్నింటికి క్వింటాల్‌కు బోనస్ 500 రూపాయలు చెల్లిస్తామని చెప్పి కోతలు విధించి రైతులను మోసం చేశారని ఆయన తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. రాబోయే రోజుల్లో ధాన్యం కొనే పరిస్థితిలో తెలంగాణ సర్కార్ లేదని.. కేంద్రం ఏం కొనమంటే అదే కొంటామని ఎంత కొనమంటే అంతే కొంటామని కొర్రీలు పెడుతుందని హరీష్‌రావు. రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం 50 శాతం కొనే పరిస్థితి కూడా భవిష్యత్తులో ఉండబోవని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ప్రభుత్వం బకాయి పడ్డది ఇప్పటివరకు అక్షరాల 29 వేల 300 కోట్ల రూపాయలని హరీష్ రావు అన్నారు. రైతు భరోసా కానీ రైతు భీమా కానీ ఇతర సంక్షేమ పథకాల ద్వారా రైతులకు ఇప్పటివరకు ఈ మొత్తం అందజేస్తుంది. ప్రగతిభవన్ ముందు కంచెను తొలగిస్తామని గొప్పగా చెప్పుకొని బంజారాహిల్స్‌లో నిర్మాణం గెస్ట్ హౌస్‌కు 1700 కోట్లతో కంచెను ఎందుకు నిర్మించారని రేవంత్ రెడ్డి సర్కార్‌ను ఆయన ప్రశ్నించారు.
హైదరాబాద్‌లో నాలుగు చోట్ల వందల కోట్లతో గెస్ట్ హౌస్‌లను ఎందుకు నిర్మించుకున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఫ్యూచర్ లేని ఫ్యూచర్ సిటీలో ఆరు వరుసల రోడ్డు వందల కోట్లతో గెస్ట్ హౌస్ ఎందుకు నిర్మించారని ఆయన అన్నారు. ఎస్బిఐ కి కేటాయించిన వేలం వేసి సొమ్ము చేసుకోవాలని చూసిన రేవంత్ సర్కారుకు కోర్టు ద్వారా అడ్డంకులు రావడంతో బ్యాంకులనే బ్లాక్ మెయిల్ చేసి కాలం గడుపుతున్నారు.

