లెనిన్ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. వీక్ డేస్ లో నెమ్మదించినప్పటికీ చాలా ఏరియాలలో బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాలు వస్తున్నాయి. బిజినెస్ మరీ ఎక్కువ ధరలకు లేకపోవడం ప్లస్ రెగ్యులర్ టికెట్ రేట్లతోనే ప్రొసీడ్ కావడం చాలా కలిసి వచ్చింది. వంద కోట్ల మార్కు అందుకుంటుందా లేదా అనేది ఈ వీకెండ్ మీద ఆధారపడి ఉంటుంది. హాలీవుడ్ మూవీ ఒడిస్సి తప్ప చెప్పుకోదగ్గ పోటీ లేకపోవడంతో వీకెండ్ మళ్ళీ లెనిన్ జోరు చూపించడంలో డౌట్ అక్కర్లేదు.
ఇదిలా ఉండగా అఖిల్ ఒక విషయంలో అదృష్టవంతుడిని చెప్పాలి. ఎందుకనేది అర్థం కావాలంటే కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. ఏజెంట్ తర్వాత యువి క్రియేషన్స్ సంస్థ అఖిల్ తో ఒక భారీ ఫ్యాంటసీ మూవీ ప్లాన్ చేసుకుంది. ధీర టైటిల్ అనుకున్నారు. ఎప్పటి నుంచో ఆ బ్యానర్ లో పని చేస్తున్న అనిల్ ని దర్శకుడిగా పరిచయం చేసే విధంగా గ్రౌండ్ సెట్ చేశారు. దాని కోసం అఖిల్ పొడవటి జుట్టు పెంచి పూర్తిగా మారిపోయిన ఫోటోలు ఇప్పటికీ ఉన్నాయి.
రకరకాల కారణాల వల్ల అసలది ఓపెనింగ్ జరగకుండానే ఆగిపోయింది. విశ్వంభర, ఘాటీ ఆలస్యం కావడం ఆర్థికంగా ప్రభావం చూపించగా కపుల్ ఫ్రెండ్లీ, బైకర్ అనుకున్న టైం కాకుండా లేట్ రిలీజ్ కావడం ఇంకో ఎఫెక్ట్ ఇచ్చింది. దీనితో ప్రొడక్షన్ పరంగా యూవీ వేగం తగ్గిపోయింది. ఈలోగా అఖిల్ దగ్గరకు లెనిన్ కథ రావడం, అది నచ్చడం, నాగార్జున స్టాంప్ పడటమే కాక అన్నపూర్ణని భాగస్వామిగా చేయడం జరిగిపోయాయి. ఫలితమే ఇప్పుడు మనం చూస్తున్న లెనిన్ ఘనవిజయం.
ఒకవేళ అఖిల్ ఆ ప్యాన్ ఇండియా సినిమా చేసుంటే ఏమయ్యేదో కానీ ఇప్పుడున్న పరిస్థితిలో లెనిన్ లాంటి విలేజ్ డ్రామానే కరెక్ట్. బడ్జెట్ పరంగా రిస్క్ లేకుండా మొత్తం రికవరీ అయిపోతుంది. నెక్స్ట్ కూడా ఇదే ఆలోచనను కొనసాగించాలి. బాగా సెటిల్ అయ్యాక అప్పుడు పుష్ప, బాహుబలి టైపులో ఆలోచించవచ్చు. అన్నట్టు మురళికిషోర్ అబ్బూరుతోనే మరో సినిమా కోసం అఖిల్ చాలా ఆసక్తిగా ఉన్నాడట. కాకపోతే సెట్ కావడానికి కొంచెం టైం పట్టేలా ఉంది.

