జగిత్యాల: వరి కొయ్యలను కాల్చే రైతులపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. పంట పొలాలలో వరి కొయ్యలు కాల్చిన 8 మంది రైతులకు 5 వేల రూపాయల చొప్పున జరిమానా విధించింది. కథలాపూర్ మండలం రాజారాం తండాలో వరి కొయ్యలకు రైతులు నిప్పంటించారు. ఈ విషయం తెలుసుకున్న వ్యవసాయ శాఖ అధికారులు గ్రామ పంచాయతీకి జరిమానా విధించారు.
గతంలో వారి కొయ్యలను కాల్చరాదని గ్రామ పంచాయతీలో గ్రామస్తులు తీర్మానం చేశారు. పంట అవశేషాలను కాల్చకుండా శాస్త్రీయ పద్దతిలో నిర్వహించి నేల సారాన్ని కాపాడాలని జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో వారి కొయ్యలను కాల్చితే కఠిన చర్యలు తీసుకుంటామని రైతులను హెచ్చరించారు.
వరి కొయ్యలు కాల్చడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం జీవో 27 జారీ చేసింది. ఈ జీవో ప్రకారం నిబంధనలను ఉల్లంఘించిన వారికి పర్యావరణ పరిహారం పేరుతో భారీ జరిమానాలు విధిస్తారు. బహిరంగంగా పంట వ్యర్థాలను తగలబెట్టే తీవ్రతను బట్టి రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానాలు విధించిన గ్రామ పంచాయతీలకు జరిమానాలు వసూలు చేస్తారు. ఈ విషయాలను వ్యవసాయ అధికారులు రైతులకు వివరిస్తున్నా వరి కొయ్యలను రైతులు కాలుస్తూ ప్రమాదాలు చేస్తున్నారు.
►ఇంకా చదవండి | గండిపేట ఫేక్ జీవో కేసులో మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుకు 14 రోజుల రిమాండ్…
జగిత్యాల జిల్లాలో రైతులు పంట అవశేషాలను, వరి కొయ్యలను కాల్చవద్దని, అలా చేస్తే వారికి జరిమానా విధిస్తామని కలెక్టర్ సత్యప్రసాద్ హెచ్చరికలు జారీ చేశారు. వరి కొయ్యల దహనం వల్ల పర్యావరణ కాలుష్యం పెరగడంతో పాటు భూమిలోని సేంద్రియ కార్బన్, వానపాములు నశించి భూసారం తగ్గుతుంది. ఇతర మంటలు అదుపు తప్పి సమీపంలోని ఆయిల్ పామ్, మామిడి తోటలకు వ్యాపించి రైతులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పంట అవశేషాలను తగలబెడితే రూ.5,000 నుంచి రూ.25,000 వరకు జరిమానా విధిస్తామని ప్రకటించారు.

