ఎక్కడైనా అదికార పార్టీ ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతలను లాగేందుకు తనదైన శైలి అస్త్రాలను ప్రయోగిస్తుంది. అయితే తమిళనాట జరుగుతున్న పరిణామాలు మాత్రం పార్టీ ఫిరాయింపుల కిందకు రావనే చెప్పాలి. ఎందుకంటే.. అక్కడ కొత్తగా అదికారం చేసిన విజయ్ పార్టీ టీవీకే వద్దన్నా మద్దతు పెరుగుతోంది. విజయ్ పిలవకున్నా కూడా ఆయా పార్టీల ఎమ్మెల్యేలు… తమ పదవులతో పాటు పార్టీలకూ రాజీనామాలు చేసి మరీ విజయ్ చెంతకు చేరుతున్నారు. ఈ తరహా పరిణామాలతో ప్రత్యేకించి అన్నాడీఎంకేకు తీరని నష్టం జరుగుతోందని చెప్పక తప్పదు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీకి కాస్త దూరంలో టీవీకే నిలవగా… తమకు మద్దతు ఇస్తామంటే తాము ఇస్తామని పలు పార్టీల నేతలు క్యూ కట్టిన సంగతి తెలిసిందే. ఈ కోరిక విజయ్ తన విశ్వాస పరీక్షను అతి సులువుగా నెగ్గేశారు. ఇప్పుడు ఇతర పార్టీల నేతలు ఆయనకు అవసరం లేదు. అసలు ఇతర పార్టీలకు చెందిన నేతలను ఆయన ఆహ్వానించడమూ లేదు. అయినా కూడా రాజకీయాల్లో తలలు పండిన వారిలో చాలా మంది తమ భవిష్యత్తును చూసుకుని విజయ్ చెంత చేరుతున్నారు.
అన్నాడీఎంకే ఇక అధికారం చేజిక్కించుకునే అవకాశాలు లేవనే చెప్పాలి. ఇదే పరిశీలనలో గ్రహించిన పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు సత్యభామ, మరగథం, జయకుమార్లు సోమవారం అన్నాడీఎంకేతో పాటు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. ఆ తర్వాత వారు నేరుగా విజయ్ వద్దకు చేరి టీవీకేలో చేరిపోయారు. వారి రాజనామాలో వారి నియోజకవర్గాలకు జరిగే ఉప ఎన్నికల్లో వారంతా టీవీకే అభ్యర్థులుగా బరిలోకి దిగి విజయం సాధించేందుకు సిద్ధపడ్డారు.
ఇక తాజాగా మంగళవారం మరో అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఆ ముగ్గురి బాటలోనే సాగారు. అన్నాడీఎంకే తరపున అన్నాడీఎంకే మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన సుబ్బయ్య మంగళవారం రాజీనామా చేశారు. ఆయన కూడా పై ముగ్గురి మాదిరిగానే తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. సుబ్బయ్య కూడా త్వరలోనే విజయ్ సమక్షంలో టీవీకేలో చేరి… తన నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో టీవీకే అభ్యర్థిగా బరిలోకి దిగిన సమాచారం.
ఇదిలా ఉంటే… అన్నాడీఎంకేకు రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ప్రభాకర్ ఆమోదించారు. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలు…తమ రాజీనామాలను స్పీకర్ ఫార్మాట్ లోనే సమర్పించారు. దీంతో వారి రాజీనామాలను స్పీకర్ వెనువెంటనే ఆమోదించారు. తాజాగా సుబ్బయ్య కూడా వారి బాటలోనే స్పీకర్ ఫార్మాట్ లోనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాకూ త్వరలోనే ఆమోదం లభించే అవకాశం ఉంది. మొత్తంగా తమిళనాట విజయ్ కు వద్దన్నా మద్దతు పెరిగిపోతోందని చెప్పాలి.

