– ప్రకటన –
నవతెలంగాణ-హైదరాబాద్: అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టామ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఇండిగో విమానంలో అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.4.26 కోట్ల విలువైన 24 విదేశీ బంగారు బిస్కెట్లను పట్టుకున్నారు. విమానం టాయిలెట్‌లోని స్పీకర్ బాక్స్‌లో అత్యంత చాకచక్యంగా దాచిన ఈ బంగారాన్ని అధికారులు గుర్తించారు.
వివరాల్లోకి వెళితే, జూన్ 12న దుబాయ్ నుంచి ఇండిగో విమానం అహ్మదాబాద్ చేరుకుంది. అందిన ముందస్తు సమాచారం మేరకు కస్టమ్స్ అధికారులు, ఇంజనీర్ల సహాయంతో విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు జరిగాయి. ఈ తనిఖీలలో విమానం ముందు భాగంలోని టాయిలెట్లో ఉన్న అనౌన్స్మెంట్ స్పీకర్ బాక్స్‌లో నల్లటి ప్లాస్టిక్ టేపుతో చుట్టిన రెండు పౌచ్‌లను అధికారులు పేర్కొన్నారు.
ఆ పౌచ్‌లను తెరిచి చూడగా, 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 24 బంగారు బిస్కెట్లు లభించాయి. వీటి మొత్తం బరువు 2,799.3 గ్రాములు కాగా, మార్కెట్ విలువ సుమారు రూ.4,26,89,325 ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ బంగారం తమదేనంటూ ప్రయాణికులు లేదా విమాన సిబ్బంది ఎవరూ ముందుకు రాలేదని, కస్టమ్స్ చట్టం, 1962 నిబంధనల ప్రకారం దాన్ని అన్క్లెయిమ్డ్ ఆస్తిగా పరిగణించి స్వాధీనం చేసుకున్నారు.
విమానాన్ని భారత్‌లోకి చేర్చిన అనంతరం, దేశీయ ప్రయాణికులు లేదా విమానాశ్రయ సిబ్బంది సహాయంతో ఈ బంగారాన్ని బయటకు తరలించేందుకు స్మగ్లర్లు కుట్ర పన్నారని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై అహ్మదాబాద్ కస్టమ్స్ విభాగం కేసు నమోదు చేసి, లోతైన దర్యాప్తు చేపట్టారు.
– ప్రకటన –

