ఏండ్ల తరబడి ఎదురుచూసిన కార్మిక వర్గానికి తెలంగాణ ప్రభుత్వం తియ్యటి వార్త చెప్పింది. దాదాపు 12 సంవత్సరాల తర్వాత కనీస వేతనాలపై సమగ్ర సవరణ చేపట్టి, శ్రామికుల జీవితాల్లో కొత్త ఆశలు నింపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవతో తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రంలోని 1.11 కోట్లకు పైగా కార్మిక కుటుంబాలకు నేరుగా లాభం చేకూర్చనుంది. పెరిగిన ధరలు, ఆకాశాన్నంటిన జీవన వ్యయంతో కార్మికులు కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నారు. జీవన వ్యయం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన వారికి అందుతున్నది పాత వేతనాలే! ఇన్నాళ్లు ఇదే పరిస్థితి. ముఖ్యంగా అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికుల జీవితం చేతికి వచ్చిన నోటికి సరిపోని స్థితికి చేరింది. ఇలాంటి సమయంలో ప్రభుత్వం కేవలం ఫైళ్ల పరిమితిలో కాకుండా, మానవీయ కోణంలో సమస్యను చూసి ప్రభుత్వంతో నిర్ణయం తీసుకునేలా మంత్రి వివేక్ హర్షణీయం.
శ్రమకు తగిన గౌరవం
రాష్ట్రంలోని 73 షెడ్యూల్డ్ ఉపాధి రంగాలకు వేతన నిర్మాణం తీసుకురావడం ద్వారా ‘కార్మికుల శ్రమ భావనకు తగిన గౌరవం’ అనే భావనకు ప్రభుత్వం కొత్త అర్థం చెప్పింది. అన్స్కిల్డ్ కార్మికులకు దాదాపు 35 శాతం వరకు వేతన పెంపు ఇవ్వడం చిన్న విషయం కాదు. సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్ వర్గాలకు కూడా పరీక్ష పెంపులు ప్రకటించడం ద్వారా ప్రతి శ్రామిక కుటుంబానికి భరోసా కల్పించింది. ఈ నిర్ణయంలో మరో ముఖ్యమైన విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఒకవైపు కార్మికుల సంక్షేమం.. మరోవైపు పరిశ్రమల అభివృద్ధి. రెండింటినీ సమన్వయం చేస్తూ ప్రభుత్వం ముందడుగు వేసింది. ట్రేడ్ యూనియన్లు, పరిశ్రమల ప్రతినిధులు, కోర్టు కేసులు, పొరుగు రాష్ట్రాల వేతనాలు, ద్రవ్యోల్బణ పరిస్థితులు – అధ్యయనం చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నది. ప్రజల ప్రభుత్వం అంటే ఏమిటో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరోసారి చాటిచెప్పిందనే అభిప్రాయం కార్మిక వర్గంలో వ్యక్తమవుతోంది. ఎన్నికల హామీలకే పరిమితం కాకుండా, శ్రామికుల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు ఈ నిర్ణయంలో స్పష్టంగా రూపొందించబడింది.
కార్మిక ఉద్యమంతో కాక ప్రత్యేక అనుబంధం
మంత్రి వివేక్ వెంకటస్వామికి కార్మిక ఉద్యమంతో ప్రత్యేక అనుబంధం ఉంది. కార్మికులతో వారి కుటుంబానిది పేగుబంధం. ఆయన తండ్రి, దివంగత నేత కాకా వెంకటస్వామి జీవితాంతం కార్మికుల హక్కుల కోసం పోరాడిన నాయకుడు. సింగరేణి నుంచి సిర్పూర్ వరకు కార్మికుల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి ఇప్పటికీ గుర్తుండేలా ఉంది. ఇప్పుడు అదే కుటుంబం నుంచి వచ్చిన వివేక్ వెంకటస్వామి కార్మికశాఖ మంత్రిగా ఉండి, కార్మికులకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవడం కార్మిక వర్గంలో కొత్త నమ్మకాన్ని పెంచుతోంది. సంక్షేమం, మూడు సామాజిక న్యాయం, అభివృద్ధి – ఈ లక్ష్యాలను ఒకే నిర్ణయంలో ప్రతిబింబింపజేసిన అరుదైన ఉదాహరణగా ఈ వేతన సవరణ నిలిచిపోతుంది. తెలంగాణలో ఇకపై కార్మికుల చెమటకు విలువ ఉంది అనే భావన మరింత బలపడటం ఖాయం.
– సాగిర్ వేంద్రి
జరనలిస్ట్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.

