గేమ్ ఛేంజర్, 2 దారుణ ఫలితాలు పక్కనపెడితే దర్శకుడు శంకర్ ఒకప్పుడు సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త స్థాయికి తీసుకెళ్లిన మాట వాస్తవం. జెంటిల్ మెన్, ఒకే ఒక్కడు, భారతీయుడు, అపరిచితుడు ఒకదాన్ని మించి మరొకటి కమర్షియల్ గా బ్లాక్ బస్టర్స్ అనిపించుకోవడమే కాదు గ్రాండియర్ కు నిలువెత్తు ప్రతిరూపంగా నిలిచాయి. రోబో ఇప్పుడు చూసినా అందులో విజువల్ ఎఫెక్ట్స్ అబ్బుర పరుస్తున్నాయి. వీటిని రీ క్రియేట్ చేయడం అంత ఈజీ కాదనే స్థాయిలో మెప్పిస్తుంది.
సరే ఇదంతా గడిచిపోయినా గతం కాబట్టి వర్తమానంలోకి వద్దాం. శంకర్ వారసుడు ఆర్జిత్ శంకర్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. అట్లీ దగ్గర సహాయకుడిగా పని చేసిన అశోక్ అనే దర్శకుడికి ఈ బాధ్యత అప్పగించారు. ఇతను గతంలో శివకార్తికేయన్‌తో ఒక పీరియాడిక్ డ్రామా తీయాలని ప్రకటన చేసి తర్వాత ముందుకు వెళ్లలేదు. ఇప్పుడు అర్జిత్ లాంచ్ అవకాశం దొరికింది. అసలు అట్లీనే శంకర్ దగ్గర పని చేశాడు. తిరిగి అట్లీ దగ్గర అసిస్టెంట్ కి శంకర్ తన కొడుకు రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం విచిత్రం.
మాములుగా అయితే లెజెండరీ దర్శకులు తమ కొడుకులను తమ డైరెక్షన్లోనే ఇండస్ట్రీకి పరిచయం చేస్తారు. దాసరి నారాయణరావు గారి అబ్బాయి అరుణ్ కుమార్ ఈ తరహాలో ‘గ్రీకువీరుడు’తో ఎంట్రీ ఇచ్చాడు. వర్కౌట్ కాకపోవడం వేరే సంగతి. కోదండరామిరెడ్డి గారి అబ్బాయి వైభవ్ ని ఆయన దర్శకత్వంలోనే ‘గొడవ’తో తీసుకొచ్చారు. ఇది ఆడలేదు. రాఘవేంద్రరావు గారి కొడుకు కోవెలమూడి ప్రకాష్ ని ఉషాకిరణ్ సంస్థ ద్వారా ‘నీతో’ రూపంలో వేరొకరికి అప్పగిస్తే అది ఫ్లాపే.
కాబట్టి ఇలా కల్ట్ మేకర్స్ వారసులు చాలా సందర్భాలలో ఫెయిలైన దాఖలాలే ఎక్కువగా ఉన్నాయి. మరి శంకర్ ఈ నెగటివ్ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తారేమో చూడాలి. ఎలాంటి హంగామా లేకుండా సింపుల్ గా ఈ ప్రాజెక్టు లాంచ్ ప్రకటించింది. శంకర్ కూతురు అదితి శంకర్ కూడా హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో అదృష్టం పరీక్షించుకుంది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్’ భైరవం’తో టాలీవుడ్ కొచ్చింది కానీ పనవ్వలేదు. మరి తమ్ముడు ఏం చేస్తాడో లెట్ వెయిట్ అండ్ సీ.

