దర్శక ధీరుడు రాజమౌళి కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం.. సింహాద్రి. ఆయనకు అది రెండో సినిమానే. కానీ ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టేశారు. ఈ చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ కూడా సూపర్ స్టార్ అయిపోయాడు. తొలి సినిమా ‘స్టూడెంట్ నంబర్ వన్’ హిట్టయినా పెద్దగా పేరు సంపాదించుకోలేకపోయిన జక్కన్న.. ‘సింహాద్రి’తో అగ్ర దర్శకుల్లో ఒకడిగా ఎదిగిపోయాడు.
ఐతే ఈ చిత్రం ప్రాణం అనదగ్గ ఒక సన్నివేశం విషయంలో తన టీం అంతా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు రాజమౌళి తాజాగా రూపొందించారు. ఫ్రాన్స్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అక్కడ ఓ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ ‘సింహాద్రి’కి సంబంధించిన కీలక సన్నివేశం గురించి గుర్తు చేసుకున్నారు.
ఈ చిత్రంలో తారక్.. హీరోయిన్ భూమిక తండ్రి అయిన భాను చందర్‌ను కాల్చి చంపుతాడన్న సంగతి తెలిసిందే. చేతిలో బాంబు ఉన్న సూట్‌కేస్‌తో రైలు ఎక్కబోతుంటే.. ట్రైన్లో ఉన్న వేల మందిని కాపాడడం కోసం మంచి వాడైన భానుచందర్‌ను కాల్చి చంపేస్తాడు తారక్. ఐతే తన సినిమాల కథా చర్చలన్నీ తన కుటుంబ సభ్యులతోనే జరుగుతాయి, అందరి ఏకాభిప్రాయం మేరకు స్క్రిప్టు లాక్ చేయబడింది.. కానీ ఇక్కడ ఒక మంచి వ్యక్తిని హీరో చంపేస్తే దాన్ని ప్రేక్షకులు ఒప్పుకోరంటూ తన టీంలో అందరూ అభ్యంతరం వ్యక్తం చేశారని రాజమౌళి తెలిపాడు.
కానీ ఇది కథకు ప్రాణం అనదగ్గ సన్నివేశం ఇదని.. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ బాగా పండుతుందని, ఎమోషన్ వర్కవుట్ అవుతుందని వాదించానని రాజమౌళి వెల్లడించాడు. ఈ సీన్ విషయంలో మిగతా అందరూ ఒక వైపు ఉంటే.. తాను మాత్రం ఇంకోవైపు ఉండి ఈ సన్నివేశాన్ని సినిమాలో పెట్టానని.. ఆ సన్నివేశానికి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయి సినిమా బ్లాక్ బస్టర్ అయిందని రాజమౌళి గుర్తు చేసుకున్నాడు.

