లండన్: వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగం 12వ సీడ్ మార్టా కొస్టియుక్ (ఉక్రెయిన్), 9వ సీడ్ లిండా నొస్కోవా (చెక్ రిపబ్లిక్) సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లారు. పురుషుల సింగిల్స్ విభాగంలో సెర్బియా యోధుడు, ఏడో సీడ్ నోవాక్ జవోవిచ్ హోరాహోరీ పోరులో గెలిచి సెమీస్ బెర్త్‌ను సొంతం చేసుకున్నాడు. మహిళల సింగిల్స్‌లో నొస్కోవా 63, 75తో బెల్జియంకు చెందిన 25వ సీడ్ ఎలిసె మెర్టెన్స్‌ను ఓడించి ముందంజ వేసింది. తొలి సెట్లో నొస్కోవా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ లక్షం దిశగా సాగింది. కళ్లు చెదిరే షాట్లతో మెర్టెన్స్‌ను హడలెత్తించిన నొస్కోవా ఎలాంటి ప్రతిఘటన లేకుండానే సెట్‌ను సొంతం చేసుకుంది. కానీ రెండో సెట్లో మెర్టెన్స్ పుంజుకుంది. అద్భుత పోరాట పటిమతో నొస్కోవాకు గట్టి పోటీ ఇచ్చింది. ఇటు నొస్కోవా అటు మెర్టెన్స్ సర్వం ఒడ్డడంతో పోరు టైబ్రేకర్ వరకు వెళ్లింది. ఇందులో పైచేయి సాధించిన నొస్కోవా సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి సెమీస్‌కు చేరుకుంది. మరో క్వార్టర్ ఫైనల్లో మార్టా కొస్టియుక్ అలవోక విజయంతో సెమీస్‌లోకి ప్రవేశించింది. 13 పౌలిని (ఇటలీ)తో జరిగిన మ్యాచ్‌లో మార్టా 63, 62తో జయకేతనం ఎగుర వేసింది. ఆరంభం నుంచే చెలరేగి ఆడిన కొస్టియుక్ ప్రత్యర్థికి కోలుకునే ఛాన్స్ ఇవ్వలేదు. దూకుడైన ఆటతో అలరించిన మార్ట వరుసగా రెండు సెట్లు గెలిచి ముందంజ వేసింది.

