హైబిపి (అధిక రక్తపోటు) అనేది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేస్తున్న ఒక ప్రధాన ఆరోగ్య సమస్య. దీనిని “సైలెంట్ కిల్లర్” అని పిలుస్తారు. కారణం, చాలా మందిలో హైబిపి ప్రారంభ దశల్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. వ్యక్తికి తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాననే భావన, లోపల గుండె, మెదడు, కండరాలు మరియు కంటి రక్తనాళాలపై నెమ్మదిగా నష్టం జరుగుతూ ఉంటుంది.
రక్తం ధమనుల గోడలపై సాధారణం కంటే ఎక్కువ ఒత్తిడితో ప్రవహించినప్పుడు దానిని హైబీపీ అంటారు. సాధారణంగా 120/80 mmHg వరకు ఉన్న రక్తపోటును సాధారణంగా పరిగణిస్తారు. 140/90 mmHg లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే హైబిపిగా గుర్తిస్తారు. 180/120 mmHg కంటే ఎక్కువగా ఉంటే అది అత్యవసర వైద్య పరిస్థితిగా పరిగణించబడుతుంది.
హైబిపి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అధికంగా ఉప్పు తీసుకోవడం, ఊబకాయం, వ్యాయామం లేకపోవడం, ధూమపానం, మద్యపానం, మానసిక ఒత్తిడి, వంశపారంపర్య కారణాలు, మధుమేహం మరియు కిడ్నీ వ్యాధులు హైబిపికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.
హైబీపీ ఉన్నవారిలో కొన్నిసార్లు తలనొప్పి, తల తిరగడం, గుండె దడ, చూపు మసకబారడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అయితే చాలామందిలో ఎలాంటి లక్షణాలు లేకపోవడం వల్లనే ఇది ప్రమాదకరంగా మారుతుంది. అందుకే 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా బిపి పరీక్ష చేయించుకోవడం చాలా అవసరం.
హైబిపిని నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. గుండెపోటు, స్ట్రోక్, గుండె వైఫల్యం, పనితీరు దెబ్బతినడం, కంటి చూపు తగ్గడం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
హైబిపిని నియంత్రించడానికి జీవనశైలిలో మార్పులు చాలా ముఖ్యమైనవి. రోజూ కనీసం 30 నిమిషాలు నడవడం, ఉప్పు తగ్గించడం, పండ్లు మరియు కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం, బరువును నియంత్రించడం, ధూమపానం మరియు మద్యపానాన్ని మానేయడం వంటి చర్యలు బీపీని నియంత్రించడంలో సహాయపడతాయి.
హైబిపి ఉన్నవారు సాధారణంగా అడిగే ప్రశ్న “మందులు జీవితాంతం వాడాలా?” అనేది. దీనికి సమాధానం వ్యక్తి ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. కొంతమందిలో జీవనశైలి మార్పుల వల్ల బిపి నియంత్రణలోకి వచ్చి మందుల మోతాదును తగ్గించవచ్చు. అయితే చాలామందికి దీర్ఘకాలం లేదా జీవితాంతం మందులు అవసరం కావచ్చు. ముఖ్యంగా వైద్యుడి సలహా లేకుండా బిపి మందులను అకస్మాత్తుగా ఆపకూడదు. అలా చేస్తే బిపి ఒక్కసారిగా పెరిగి గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదం పెరగవచ్చు.
అందువల్ల హైబిపిని చిన్న సమస్యగా భావించకుండా, క్రమం తప్పకుండా బిపి పరీక్షలు చేయించుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం మరియు వైద్యుల సూచనలు పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. హైబిపిని ముందుగానే గుర్తించి నియంత్రించడం ద్వారా అనేక ప్రాణాంతక సమస్యలను నివారించవచ్చు. అందుకే హైబిపిని “సైలెంట్ కిల్లర్”గా గుర్తించి అప్రమత్తంగా ఉండటం ప్రతి ఒక్కరి బాధ్యత.
డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి.. ఎంఎస్, ఎంసిహెచ్

