రేటింగ్: 2.5 / 5
- ప్రధాన తారాగణం: నికోలస్ గలిట్జిన్, కెమిలా మెండిస్, జారెడ్ లెటో, అలిసన్ బ్రీ, జేమ్స్ ప్యూర్ఫోయ్, జోహన్నెస్ హౌకుర్ జోహన్నెసన్, షార్లెట్ రిలే, క్రిస్టెన్ విగ్, మోరెనా బాకరిన్ మరియు ఇద్రిస్ ఎల్బా
- దర్శకుడు: ట్రావిస్ నైట్
- సంగీతం: డేనియల్ పెంబర్టన్
- నిర్మాత: టాడ్ బ్లాక్, జాసన్ బ్లూమెంటల్, రాబీ బ్రెన్నర్, డెవాన్ ఫ్రాంక్లిన్
80లు, 90ల కిడ్స్‌కు అమితంగా నచ్చిన క్లాసిక్ కార్టూన్ క్యారెక్టర్ ‘హీ-మ్యాన్’ (హీ-మ్యాన్). ‘ఐ హావ్ ది పవర్’ అంటూ చేతిలో కత్తి పట్టుకుని అతను చేసే సాహసాలు అప్పట్లో ఒక ఊపు ఊపాయి. ఇప్పుడు అదే అడ్వెంచరస్ మ్యాజిక్‌ను వెండితెరపైకి తీసుకొస్తూ హాలీవుడ్లో తెరకెక్కిన సరికొత్త లైవ్ యాక్షన్ ఫ్యాంటసీ చిత్రమే ఈ ‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’. ట్రావిస్ నైట్ దర్శకత్వంలో నికోలస్ గాలిట్జైన్, జారెడ్ లెటో, ఇద్రిస్ ఎల్బా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. మన తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా మరింత చేరువయ్యేలా… దీని డబ్బింగ్ వెర్షన్ కోసం టాలీవుడ్ యాక్టర్స్ నిఖిల్ సిద్ధార్థ్, రావు రమేష్, ఆదిత్య మీనన్‌లు డబ్బింగ్ చెప్పడం విశేషం. మరి ఈ సినిమా ఏ మేరకు అలరించిందో రివ్యూలో చూద్దాం.
మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్ కథ:
ఎటర్నియా గ్రహానికి చెందిన యువరాజు ప్రిన్స్ ఆడమ్ (నికోలస్ గాలిట్జైన్). కొన్ని అనివార్య కారణాల వల్ల దాదాపు పదేళ్ల పాటు భూమిపై అనమకుడిగా గడపాల్సి వస్తుంది. భూమిపై ఉన్నప్పుడు తన సొంత గ్రహం, అక్కడ ఉండే మాట్లాడే పులులు, ఎగిరే నౌకల గురించి అందరికీ చెబుతాడు, కానీ ఎవరూ నమ్మరు. పదేళ్ల తర్వాత ఆడమ్ అనూహ్యంగా తిరిగి తన సొంత రాజ్యమైన ఎటర్నియాకు చేరుకుంటాడు. అయితే అప్పటికే ఆ సామ్రాజ్యం క్రూరడైన విలన్ స్కెలిటార్ (జారెడ్ లెటో) చేతుల్లో చిక్కి వినాశనానికి గురై ఉంటుంది. తన చిన్ననాటి స్నేహితురాలు తీలా (కామిలా మెండిస్), డంకన్ (ఇద్రిస్ ఎల్బా)ల సహాయంతో ఆడమ్ తన రాజ్యాన్ని ఎలా కాపాడుకున్నాడు? తనలో దాగున్న అసలైన శక్తులను తెలుసుకుని ‘హీ-మ్యాన్’గా ఎలా రూపాంతరం చెందాడు? చివరకు స్కెలిటార్ను ఎలా అంతమొందించాడు? అనేదే ఈ సినిమా కథ.
విశ్లేషణ:
ఇటీవలి కాలంలో వచ్చే చాలా ఫాంటసీ లేదా సూపర్ హీరో సినిమాలు ‘మార్వెల్’ స్టైల్ ఐరానిక్ కామెడీ, సెల్ఫ్-రెఫరెన్షియల్ జోకులతో నిండిపోతున్నాయి. “మనం చేసేది చాలా విడ్డూరంగా ఉంది కదూ” అంటూ పాత్రలే స్వయంగా కథను వెక్కిరించుకునే ట్రెండ్ నడుస్తోంది. కానీ ‘మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’ ఆ ఫార్ములాకు భిన్నంగా వెళ్ళింది. ఈ సినిమాలోని అతిపెద్ద ప్లస్ పాయింట్… దీని ‘సిన్సియారిటీ’. కథలోని ఫాంటసీని, ఆ లోకంలోని వింతలను దర్శకుడు ఎక్కడా కించపరచకుండా, చాలా నిజాయితీగా చూపించారు.
సినిమాలో కాస్త అమాయకత్వం, చైల్డ్లైష్ వండర్లు కనిపిస్తాయి. సినిమా టోన్‌కు ఒక ఉదాహరణ చెప్పాలంటే… పాడుబడిన రాజ్యాన్ని చూసి ఆడమ్ “స్కెలిటార్ ఎందుకు ఇలా చేశాడు?” అని అడిగితే, తీలా “మొహం మీదే అస్థిపంజరం ఉన్నవాడి నుండి ఇంకేం ఆశిస్తావు?” అంటుంది. సినిమా అంతా ఇలానే సాగుతుంది. నేటి తరం సినిమాలు ఎక్కువగా ‘గ్రిమ్ డార్క్’నేపథ్యాల్లో సాగుతుంటే, ఈ సినిమా బ్రెయిట్ కలర్స్, కలర్‌ఫుల్ విజువల్స్‌తో కళ్లకు విందులా అనిపిస్తుంది.
అయితే, కథలో కాస్త లోతు లోపించింది. ఆడమ్ భూమిపై ఎలా పెరిగాడు అంటే, అలాగే ఎటర్నియా పురాణాలు, గ్రేస్కల్ శక్తుల మూలాలను ఇంకాస్త వివరంగా చూపించి ఉంటే బాగుండేది. అయినప్పటికీ, ఒక కమర్షియల్ ఫ్యాంటసీ ఎంటర్టైనర్గా తెలుగు ప్రేక్షకులకు ఇది ఖచ్చితంగా ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది.
నటీనటుల పనితీరు:
ప్రిన్స్ ఆడమ్‌గా అమాయకత్వాన్ని, హీ-మ్యాన్‌గా మారినప్పుడు పవర్ఫుల్ ఎనర్జీని నికోలస్ గాలిట్జైన్ బాగా పండించాడు. అతని నటనలోని సిన్సియారిటీ క్యారెక్టర్‌ను ఎలివేట్ చేసింది. ఈ సినిమాకు అసలైన హైలైట్ జారెడ్ లెటోన్. ఆయన కేవలం ఒక విలన్ లాగా కాకుండా, పాతకాలపు ‘రౌడీ’ తరహాలో నవ్విస్తూనే భయపెట్టే పాత్రలో జీవించేశారు. మొహంపై స్కెలిటన్ మాస్క్, తన బాడీ లాంగ్వేజ్‌తో అద్భుతమైన హావభావాలు పలికించారు. తీలా పాత్రలో కామిలా మెండిస్ యాక్షన్ సీన్స్‌లోనూ, ఆడమ్‌కు సపోర్ట్‌గా నిలిచే సీన్స్‌లోనూ మెప్పించింది. ఇద్రిస్ ఎల్బా తన పరిధి మేర చక్కగా నటించారు.
ఇక ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ దీని తెలుగు డబ్బింగ్ వెర్షన్. హీరో నికోలస్ గాలిట్జైన్ పాత్రకు మన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తన వాయిస్ అందించారు. ఫాంటసీ, అడ్వెంచర్ సినిమాల్లో నిఖిల్ బేస్ వాయిస్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇక్కడ కూడా హీ-మ్యాన్ ఎలివేషన్ సీన్స్‌లో నిఖిల్ వాయిస్ బేస్ సినిమా రేంజ్‌ను పెంచింది. విలన్ స్కెలిటార్ పాత్రకు ఆదిత్య మీనన్ డబ్బింగ్ చెప్పారు. ఆ పాత్రలోని విలనిజం, బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా ఆయన తనదైన స్టైల్లో చెప్పిన డైలాగ్స్ థియేటర్లలో నవ్వులు పూయిస్తాయి, భయపెడతాయి. అలాగే హీరో మెంటార్, ఆర్మ్స్ మాస్టర్ డంకన్ పాత్రకు వర్సటైల్ యాక్టర్ రావు రమేష్ డబ్బింగ్ చెప్పారు. ఆయన వాయిస్ ఆ పాత్రకు నిండుదనాన్ని ఇచ్చింది. ఈ టాలీవుడ్ స్టార్స్ వాయిస్ వల్ల ఇదొక హాలీవుడ్ సినిమా అనే ఫీలింగ్ పోయి, మనకు బాగా కనెక్ట్ అవుతుంది.
సాంకేతిక నిపుణుల పనితీరు విషయంకి వస్తే ట్రావిస్ నైట్ మేకింగ్ స్టైల్ అభినందనీయం. 80ల నాటి నాస్టాల్జియాను చెడగొట్టకుండా, ఆధునిక గ్రాఫిక్స్ జోడించి ప్రదర్శించిన విధానం బాగుంది. సినిమాటోగ్రఫీ మరియు విజువల్ ఎఫెక్ట్స్ (VFX) అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా ఎటర్నియా గ్రహాన్ని చూపించిన రంగుల ప్రపంచం, క్యారెక్టర్ డిజైన్స్ ఫాంటసీ లవర్స్‌ను కట్టిపడేస్తాయి. హీ-మ్యాన్ అలానే స్కెలిటార్ మధ్య వచ్చే స్లో-మోషన్ ఫైట్ సీన్స్ థియేటర్లలో విజిల్స్ వేయండి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా యాక్షన్ ఎపిసోడ్స్‌ను బాగా ఎలివేట్ చేసింది.
ఫైనల్లీ: ఈ ‘మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’ కేవలం పిల్లల కోసమే!

