హైదరాబాద్, జూలై 18: ఖాజాగూడలోని మాలక్ష్మి కోర్ట్యార్డ్లో నిర్వహించిన ‘హెరిటేజ్ @ ఎవరీ స్టెప్ 2.0’ ప్రదర్శనకు విద్యార్థులు, పరిశోధకులు, వారసత్వాభిమానులు భారీగా తరలివచ్చారు. ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రదర్శనకు ప్రజల నుంచి మంచి స్పందన కనిపించింది.
ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ చేపట్టిన ‘ప్రిజర్వ్ హెరిటేజ్ ఫర్ పోస్టెరిటీ (PHP)’ కార్యక్రమం కింద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నిర్వహించిన విస్తృత క్షేత్ర సర్వేల్లో నమోదైన 1,800కు పైగా వారసత్వ ప్రదేశాల్లోని ఎంపిక చిత్రాలను ఇక్కడ ప్రదర్శించారు. గ్రామీణ ప్రాంతాల నిర్లక్ష్యానికి గురైన దేవాలయాలు, శాసనాలు, శిల్పాల ఫోటోలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.
చరిత్రపూర్వయుగానికి చెందిన పురావస్తువులు, నాణేలు, చిన్న శిల్పాలు, వివిధ రకాల పూసలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రతి విభాగం వద్ద సందర్శకులు ఆసక్తిగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డా. ఈమని శివనాగిరెడ్డి మాట్లాడుతూ, “ప్రతి ఒక కథ. గుర్తింపుకు నోచుకోని వారసత్వాన్ని గుర్తించి, శాస్త్రీయంగా నమోదు చేసి, భావితరాలకు కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత” అని చెప్పారు. వారసత్వ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకమని ఆయన వివరించారు.
ప్రదర్శనను సందర్శించిన వారు ఫౌండేషన్ చేస్తున్న పరిరక్షణ, డాక్యుమెంటేషన్, అవగాహన కార్యక్రమాలను అభినందించారు.

