– ప్రకటన –
నిరసన కార్యక్రమాలకు లెఫ్ట్ పార్టీల పిలుపు
నవతెలంగాణ – హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని అమెరికన్ కాన్సులెట్ వద్ద ఒక ప్రధాన రహదారికి అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ పేరుతో డొనాల్డ్ ట్రంప్ అవెన్యూగా పెట్టాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల లెప్ట్ పార్టీలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లెఫ్ట్ పార్టీల సమావేశం డిమాండ్ చేసింది. ఈ రోజు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయం, ఎంబి భవన్లో వామపక్ష పార్టీల సమావేశం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.
నేడు అమెరికా సామ్రాజ్యవాదం ప్రపంచ దేశాల సంపదను కొల్లగొట్టడానికి ప్రజల మీద యుద్ధాలను రుద్దుతున్నది. ప్రపంచ ప్రజల రక్త మాంసాలను పీల్చి పిప్పి చేస్తోంది. మనదేశం మీద ట్రంప్ ఆంక్షలు దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశాయి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం నరేంద్రమోడీ సహకారంతో దేశం నష్టపోతోంది. తెలంగాణలో వున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ బిజెపి, ఆర్ఎస్ఎస్ బాటలో నిర్ణయాలు తీసుకోవడం అత్యంత ఆక్షేపణీయం. దీనిపట్ల కాంగ్రెస్ జాతీయ నాయకత్వం స్పందించి, జోక్యం చేసుకోవాలి.
ఈ చర్యలను వ్యతిరేకిస్తూ ఈ నెల 20న బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్లో మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం ఉదయం 10.30 గం॥ లకు నిర్వహించాలని, 21న బాబూ జగ్జీవన్‌రాం విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించింది.
ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లి, రాష్ట్ర నాయకులు బండారు రవికుమార్, డీజీ నర్సింహారావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈటి.నర్సింహ, నాయకులు స్టాలిన్, సీపీఐ(ఎంఎల్`మాస్‌లైన్) రాష్ట్ర నాయకులు కె రమ, సూర్యం, ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, వెంకటేశ్వరరావు ఎస్ పీ రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు ఉన్నారు.
– ప్రకటన –

