బార్బిక్యూ నేషన్ రెస్టారెంట్ చైన్ గురించి తెలియని హైదరాబాదీలు ఉండరంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత ఫేమస్ అవి. అక్కడ ఫుడ్ కాస్త ప్రీమియం అయినా.. క్వాలిటీ కోసం కొందరు.. బీబీక్యూ లో తినాలంటే సరదాతో కొందరు వెళ్తారు. కొందరైతే ఏకంగా ఇంటికే పార్సిల్ చేసుకుంటారు. కానీ ఈ విషయం తెలిస్తే.. క్వాలిటీ మాయలో ఇలాంటి ఫుడ్ తింటున్నామా..? అనే డౌట్ రాక మానదు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు గురువారం (జులై 02) రైడ్స్ నిర్వహించారు. ఉప్పర్‌పల్లి పిల్లర్ నెం.178 వద్ద ఉన్న బీబీక్యూ నేషన్ రెస్టారెంట్లో హెచ్-ఫాస్ట్, ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
తనిఖీల్లో కుళ్లిపోయిన, గడువు ముగిసిన చికెన్, మటన్, చేపలు, ప్రాన్స్, కేక్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏ ఐటమ్ చెక్ చేసినా పరిస్థితి అలాగే ఉండటంతో అధికారులు షాకయ్యారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలపై ఉన్న ఎక్స్పైరీ తేదీలను మార్చి, కొత్త తేదీలు ముద్రించి వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు.
►ఇంకా చదవండి | ఒక్క రెడ్ కార్డ్‌తో రూ.8 కోట్ల పిజ్జాలు ఫ్రీ.. డొమినోస్ బంపర్ ఆఫర్ వైరల్!
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడేలా ఆహార పదార్థాలను నిల్వ చేసి వినియోగిస్తున్నట్లు తనిఖీల్లో వెల్లడైందని ఫుడ్ సేఫ్టీ అధికారి సౌమ్య తెలిపారు. ఉల్లంఘనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి సహించబోమని హెచ్చరించారు.
గతంలో కూడా ఇదే రెస్టారెంట్‌పై తనిఖీలు నిర్వహించడం యాజమాన్యం తీరులో మార్పు కనిపించడం లేదని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాధీనం చేసుకున్న ఆహార పదార్థాలను ధ్వంసం చేసి, రెస్టారెంట్ యాజమాన్యంపై తదుపరి చర్యలు చేపట్టాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ సందర్భంగా చెప్పారు.

