హైదరాబాద్: నగరంలో లక్ష ఇందిరమ్మ ఇళ్లను నిర్మించనున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అర్హులైన వారికి 48 గంటల్లోనే రేషన్ కార్డు ఇస్తున్నామని, 270 ఇళ్లను పేదలకు అందజేస్తున్నామని అన్నారు. హైదరాబాద్ కలెక్టరేట్లోని రెండుపడకల గదుల ఇళ్ల పట్టాలు, నాంపల్లి, చంద్రాయగుట్ట, జంగంమెట్ వాసులకు, లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పొన్నం ప్రభాకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొత్తగా 2 లక్షల పింఛన్లను అందిస్తున్నామని, నగరంలో 42 స్కూళ్లలో బ్రేక్ ఫాస్ట్ పథకం అమలు చేస్తున్నామని తెలియజేశారు. ప్రజలంతా పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు పంపించాలని పొన్నం ప్రభాకర్ సూచించారు.

