Published on: 4:49 pm, 27 మే 2026
నిజమే. తెలంగాణలోని ఆదిలాబాద్ కు చెందిన వెంకటరమణ జీవితం… ఆరిపోతున్న దీపాలకు వెలుగేనని ఘంటాపథంగా చెప్పొచ్చు. పుట్టినప్పటి నుంచి కాలు బయటపెట్టిందే లేదు… కూర్చున్నది లేదు.. నడిచింది అసలే లేదు.. స్కూలుకు వెళ్లింది లేదు.. అయితే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా అతడు ఉద్యోగం చేస్తున్నాడు. తనకు కలిగిన జీవితకాల వైకల్యాన్ని అతడు తనకు శాపంగా పరిగణించలేదు. తనకు వచ్చిన వైకల్యాన్ని చూసి భయపడనూ లేదు. గుండె నిబ్బరంతో జీవితం సాగించాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్న దానికంటే ఎక్కువగానే జీవితాన్ని పరుగు పెట్టిస్తున్నాడు.
ప్రస్తుతం 27 ఏళ్ల వయసున్న వెంకట రమణ.. పుట్టుకతోనే ఓ అరుదైన బోన్ మారో వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ జబ్బు కారణంగా అతడు ఇప్పటిదాకా పడక నుంచి లేచిందే లేదు. కాళ్లు, చేతులు కూడా ఎదగలేదు. శరీరమూ ఎదగలేదు. కానీ మస్తిస్కం మాత్రం అతడితో పాటు వేగంగా ఎదిగింది. ఇంటి నుంచి బయటకు కాలు పెట్టలేని రమణ… నానమ్మ చెప్పిన పాఠాలతో విద్యాబుద్ధులు నేర్చాడు. ఆపై కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన ఓ ట్యూటర్ ద్వారా పదో తరగతి పాసయ్యాడు. అక్కడితోనే రమణ ఆగలేదు. అన్నీ ఆన్ లైన్ ద్వారానే నేర్చుకున్నాడు. ఇప్పుడు ఉద్యోగాన్ని కూడా వర్క్ ఫ్రం హోం ద్వారా చేస్తున్నాడు.
ఈ రమణను జాతీయ వార్తా సంస్థ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) ఇంటర్వ్యూ చేసింది. అన్నీ ఉన్నా ఇంకా ఏదో లేదంటూ నిత్యం మదనపడిపోతూ… ఏదో బలహీన క్షణంలో జీవితానికి తీసుకుంటున్న వారికి సరికొత్త ఊపిరిలూడే రీతిలో రమణ జీవితాన్ని ఆ సంస్థ కళ్లకు కట్టింది. ఇప్పటికీ ఎక్కడ ఉన్నా పడుకున్న స్థితిలోనే కనిపించే రమణ… సెల్ ఫోన్ ను పట్టుకునేందుకూ చేత కాకున్నా… దానిని తన చిన్నారి చేతులతో ఆపరేట్ చేస్తూ సాగుతున్నాడు. ఈ రమణ జీవితం ఎందరికో ఆదర్శం కావాలని మనమూ ఆశిద్దాం.

