అనుకున్నంతా అయ్యింది. గతంలో బీజేపీతో ఆంటీముట్టనట్టుగా ఉంది ఆ పార్టీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు అన్నామలై తాజాగా ఆ పార్టీని వీడారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. బీజేపీని తాను వీడుతున్నట్లుగా అన్నామలై ప్రకటన. అలాగే తమిళనాడు అసెంబ్లీకి జరగనున్న తదుపరి ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని, ఆ ఎన్నికల్లో ఓ ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీతో బరిలోకి దిగుతానని ఆయన ప్రకటించారు.
తమిళనాడులో బీజేపీ బలోపేతం దిశగా బీజేపీ అధిష్ఠానం దృష్టిసారించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన అన్నామలైకి ఆ బాధ్యతలను అప్పగించింది. బీజేపీ కోరినట్టుగానే తమిళనాట బీజేపీ బలోపేతానికి అన్నామలై తన శాయశక్తులా కృషి చేశారు. అయితే ఆ మధ్య ఏం జరిగిందో, ఏమో తెలియదు గానీ… అన్నామలై ఉన్నపళంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తాజాగా పార్టీని వీడే దిశగా ఆయన అడుగులు వేయగా… అధిష్ఠానం ఆయనను అనునయించే దిశగా సాగింది.
ఈ మధ్యనే ఢిల్లీ వెళ్లిన అన్నామలై… కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తోనూ భేటీ అయ్యారు. ఈ భేటీలో పార్టీని వీడొద్దంటూ వారిద్దరూ అన్నామలైని ఉన్నారు. చర్చల్లో పెద్దగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయని అన్నామలై… తమిళనాడు తిరిగి రాగానే… తాను ముందుగానే అనుకున్నట్లుగా పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ అధిష్ఠానంతో తనకు విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని, ఆ విభేదాల కారణంగానే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు.
సమాజంలో మార్పును తీసుకొచ్చేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని… అందుకోసమే తాను బీజేపీలో చేరానని అన్నామలై అన్నారు. అయితే బీజేపీలో ఉంటూ తాను అనుకున్న పనిని చేయలేనని తెలిసిందని ఆయన అన్నారు. ఈ విధంగానే తాను బీజేపీకి రాజీనామా చేశానన్న అన్నామలై.. ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు దిశగా ఆలోచన చేస్తున్నానని చెప్పారు. మరి ఆ ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఎలా ఉంటుందన్న దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి.

