మానవ శరీరంలోని కిడ్నీలు రక్తాన్ని శుద్ధి చేస్తూ, వ్యర్థాలను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే, శరీరంలో నీటి శాతం తగ్గి లవణాలు పేరుకుపోయినప్పుడు అవి రాళ్లుగా మారుతుంటాయి. మారిన జీవనశైలి, తగినంత నీరు తాగకపోవడం, జంక్ ఫుడ్స్ వంటి అలవాట్ల వల్ల నేడు చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. 5 మిలీమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉన్న చిన్న రాళ్లను కొన్ని ఇంటి చిట్కాల ద్వారా సులభంగా బయటకు పంపవచ్చు.
రోజుకు కనీసం 3 నుండి 4 లీటర్ల నీరు తాగడం వల్ల మూత్రం పలచబడుతుంది. ఇది కొత్తగా రాళ్లు ఏర్పడకుండా నిరోధించడమే కాకుండా, ఇప్పటికే ఉన్న చిన్న రాళ్లను మూత్రం ద్వారా బయటకు నెట్టేస్తుంది. అంతే కాకుండా.. నిమ్మకాయలో ఉంటే సిట్రేట్ క్యాల్షియం రాళ్లను విచ్ఛిన్నం చేయడానికి దోహదపడుతుంది. ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కొబ్బరి నీళ్లలో లభించే పొటాషియం, సిట్రేట్ ఖనిజ లవణాలు ఒకదానితో ఒకటి కలిసి రాళ్లుగా మారకుండా చూస్తాయి. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచి, కిడ్నీల్లోని స్పటికాలను తొలగిస్తుంది.
బార్లీ గింజలను నీటిలో బాగా మరిగించి వడకట్టుకుని తాగడం వల్ల మూత్ర విసర్జన పెరుగుతుంది. ఇది కిడ్నీలపై ఒత్తిడిని తగ్గించి, టాక్సిన్ను మరియు చిన్న రాళ్లను సులభంగా బయటకు పంపుతుంది. వీటితో పాటు.. ముల్లంగి, ఉల్లిపాయ రసాలు కూడా రాళ్లు ఏర్పడకుండా కాపాడుతాయి. అయితే ఇవి ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, అవి రాళ్లను కరిగిస్తాయనడానికి స్పష్టమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. అయితే అన్ని ప్రాథమిక జాగ్రత్తలు మాత్రమే. ఒకవేళ కిడ్నీ సమస్య తీవ్రంగా ఉండి, విపరీతమైన నొప్పి, వాంతులు లేదా మూత్రంలో రక్తం పడటం వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్య నిపుణులను సంప్రదించడం చాలా ముఖ్యం.

