నిజమే… టీడీపీ అదినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో ఏ విషయంలో అయినా అంత ఈజీ అయితే కాదనే చెప్పాలి. ఏ విషయంపై అయినా చంద్రబాబుకు సమగ్ర అవగాహన ఉంటుంది. ఈ విషయం దాదాపుగా అన్ని స్థాయిల అధికార యంత్రాంగానికి తెలుసు. ఏ విషయం అయినా పకడ్బందీగా ఉంటే తప్పించి చంద్రబాబు ఒప్పుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇక ప్రజారోగ్యంలో కీలక భూమిక పోషిస్తున్న ఆసుపత్రుల్లో చెత్త చెదారం కనిపిస్తే… చంద్రబాబు ఊరుకుంటారా? ఇలాంటి పరిస్థితే శనివారం ఎదురు కాగా…అధికార పరిపాలనపై చంద్రబాబు అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. ఆసుపత్రుల ఆవరణలో చెత్త కనిపించడం లేదా?… దానిని తీసివేసి ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలియదా? అంటూ ఆయన ఓ రేంజిలో ఫైరయ్యారు.
చంద్రబాబు ప్రస్తుతం తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం కుప్పం చేరుకున్న చంద్రబాబు…శనివారం కూడా కుప్పంలోనే ఉండిపోయారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో పలు అధునాతన సౌర్యాలను ఆయన కలిగి ఉన్నారు. అనంతరం ఆసుపత్రి పరిసరాలను ఓయూ సాగిన చంద్రబాబుకు అక్కడ మూల చెత్త చెదారంతో నిండిపోయిన వైనం కనిపించింది. అప్పటిదాకా శాంతంగానే కనిపించిన చంద్రబాబు… ఆ చెత్త కంటబడిన వెంటనే అసహనానికి సిద్ధపడ్డారు. ఆసుపత్రి పరిసరాల్లో చెత్త ఉండటం ఏమిటి? ఉన్నా.. దానిని శుభ్రం చేయలేదా? అని ఆయన అక్కడి అధికారులపై ఫైరయ్యారు.
ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్న మహిళా అధికారి…చంద్రబాబు ఆగ్రహాన్ని చూసి షాకయ్యారు. పరిస్థితిని చంద్రబాబుకు వివరించే యత్నం చేశారు. అయితే ఆమె మాటను చంద్రబాబు పూర్తిగా వినలేదు. ఆసుపత్రి ఏరియాలో చెత్తచెదారాన్ని అలాగే పెట్టేసి… దానిని సమర్థించుకునే దిశగా ఏం మాట్లాడతారని ఆయన ప్రశ్నించారు. తమ ప్రభుత్వం ఇచ్చిన మంచి సద్వినియోగం చేసుకోకపోతే ఎలా? అని ఆమెపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతరత్రా జనావాసాలంటే పరిశుభ్రంగా ఉంచాలని చెబుతుంటే… ఏకంగా ఆశుపత్రి ఆవరణలోనే చెత్త పేరుకుపోయినా కనిపించడం లేదా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు ఆగ్రహాన్ని చూసి హడలెత్తిపోయిన ఆసుపత్రి సూపరింటెండ్ ఏదో సర్దిచెప్పే యత్నం చేయబోగా…చంద్రబాబు ఆమె నోటికి అడ్డుకట్ట వేశారు. అక్కడే ఉన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ ను పిలిచి… ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని, కింది స్థాయి అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఏ పని ఎప్పుడు చేయాలన్న దానిపై ఓ ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. పరిసరాల పరిశుభ్రతతో పాటుగా ఆ పరిస్థితులను అలాగే కొనసాగేలా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. మొత్తంగా తప్పు జరిగితే చంద్రబాబు రియాక్షన్ ప్రత్యక్షంగా చూసిన అదికారులు ఎక్కడివారక్కడ సర్దుకున్నారు.

