ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఎప్పుడెలా మారిపోతుందో తెలియక జనాలే కాదు.. ఆ పార్టీ నేతలు కూడా తలలు పట్టుకుంటున్నారు. ముందేమో అమరావతిని రాజధానిగా స్వాగతిస్తున్నాం, 30 వేల ఎకరాలకు తగ్గకుండా రాజధాని ఉండాలనీ అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశారు ఆ పార్టీ అధినేత జగన్. కానీ అధికారంలోకి రాగానే వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల ప్రతిపాదన చేశారు. తర్వాత ఒక దశలో రాజధాని అనే మాటే రాజ్యాంగంలో లేదంటూ స్టేట్మెంట్ ఇచ్చారు.
ఆపై విశాఖపట్టణమే రాజధాని అని తెలియజేసింది. ఇన్నిసార్లు మాట మార్చడంతో రాజధాని అంశం 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ఒక ప్రధాన కారణంగా మారింది. తర్వాత అయినా తప్పు సరిదిద్దుకుని అమరావతికి అనుకూలంగా మారుతుందేమో అని ఆశించారందరూ. ఆ పార్టీ నేతలు కొందరి మాటలు చూస్తే వైసీపీలో మార్పు మొదలైనట్లే కనిపించింది. కానీ అనూహ్యంగా జగన్ ‘మావిగన్’ అంటూ రాజధానిగా కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు.
దీనికి వచ్చిన స్పందన చూస్తే.. జగన్ మరోసారి ఎంత పెద్ద తప్పు చేశారో అర్థమై ఉండాలి. కానీ జగన్ ఫీడ్ బ్యాక్ అంటూ తీసుకోరా.. లేదంటే ఆయనకు రాంగ్ ఫీడ్ బ్యాక్ వస్తుందా అన్నది అర్థం కావడం లేదు కానీ.. 2029 ఎన్నికలు ‘అమరావతి వెర్సస్ మావిగన్’ అంశం మీద నడుస్తాయంటూ ఇంకో భారీ స్టేట్ మెంట్ ఇవ్వడం విస్మయానికి గురిచేసింది. అందరు నాయకుల తప్పులు రాజకీయాల్లో చేస్తారు. కానీ తాము తప్పు చేసింది అని తెలిశాక నేరుగా ఆ విషయం ఒప్పుకోకపోయినా.. తమ చర్యల ద్వారా పశ్చాత్తాప భావన వ్యక్తం చేయడం, సరిదిద్దుకునే ప్రయత్నం కనిపించడం జరుగుతుందని.
కానీ జగన్ తీరు మాత్రం వేరు. రాజధాని అంశంతో ఆటలు ఆడడం వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని అర్థమవుతోంది. జగన్కు ఎందుకింత ఇగో అనే చర్చ జరుగుతోంది. రాజధాని విషయంలో అసలు ఆయన లక్ష్యమేంటి అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఐతే జగన్ మనస్తత్వం తెలిసిన వారు ఈ విషయంలో ఒక ఆసక్తికర వాదన చేస్తున్నారు.
ఎవరెంత చెప్పినా అమరావతి విషయంలో జగన్ వ్యతిరేకత తగ్గేది కాదని.. ఒకవేళ అమరావతికి అనుకూలంగా మారినా తనకు ఒనగూరేది ఏమీ లేదని జగన్ భావిస్తున్నారని అంటున్నారు. రాజధాని విషయంలో వేసిన కుప్పిగెంతుల వల్ల అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలు ఎలాగూ తమ పరిస్థితి మెరుగుపడదని.. అమరావతి వ్యతిరేకిగా జనాల్లో ఎలాగూ ముద్ర పడిపోయిందని.. అలాంటపుడు ఇప్పుడు రాజధానికి మద్దతుగా నిలబడడం వల్ల తమకు కొత్తగా చేకూరే ప్రయోజనం లేదని జగన్ చెబుతున్నారు.
అమరావతిని దెబ్బ తీస్తూ ఉండటంతో.. అక్కడ కూటమి ప్రభుత్వం అనుకున్న లక్ష్యం సాధించకుండా చేయడమే జగన్ లక్ష్యంగా ఉంది. అక్కడ ఎంత డబ్బులు పెట్టి బిల్డింగులు కట్టినా, రోడ్లు వేసినా, ఇతర మౌళిక సదుపాయాలు కల్పించినా.. ప్రైవేటు వ్యాపారవేత్తలు స్వచ్ఛందంగా అక్కడికి పెద్ద ఎత్తున కదిలి రావడం, పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం, సహజంగా వ్యాపారాలు వృద్ధి చెందడం, జనాభా పెరగడం వల్ల అమరావతి అభివృద్ధి సాధ్యమవుతాయి..
అమరావతిని ఎదగనీయకుండా చేయడమే జగన్ లక్ష్యమని.. దీనివల్ల చంద్రబాబు ఏరికోరి రాజధానిలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది, ఇక్కడ పెడుతున్న వేల కోట్ల పెట్టుబడి అంతా బూడిదలో పన్నీరే అని జనాలను నమ్మించే ప్రయత్నం చేయడమే ఆయన ఉద్దేశమని అంటున్నారు. ఐతే జగన్ గేమ్ ఏంటో బాబు అండ్ కోకు అర్థం కాకుండా ఉండదు కాబట్టి.. జగన్ కు ఛాన్సివ్వకుండా అమరావతిలో అభివృద్ధితో పాటు యాక్టివిటీ కూడా పెంచి 2029 ఎన్నికలకు వెళ్తే వైసీపీకి మరోసారి గట్టి దెబ్బ తీయడానికి అవకాశం ఉంటుంది.

