జైలర్ తర్వాత దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ పేరు ఏ స్థాయిలో సౌత్ మొత్తం మారుమ్రోగిపోయిందో అభిమానులు అంత సులభంగా మర్చిపోలేరు. సూపర్ స్టార్ రజనీకాంత్ వరస ఫ్లాపులతో ఉన్నప్పుడు ఆయనకంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇవ్వడం చిన్న విషయం కాదు. అందుకే జైలర్ 2 కూడా ఓకే అయిపోయి అక్టోబర్ విడుదలకు రెడీ అవుతోంది. అయితే సితార సంస్థకు తనో కమిట్ మెంట్ ఇచ్చాడు. అది కూడా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఒక పెద్ద ప్యాన్ ఇండియా మూవీ తీయాలనే ప్లాన్ తో.
ఇది గతం. ఇప్పుడు వర్తమానంలోకి వద్దాం. నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ 2 పూర్తి చేసిన వెంటనే రజినీకాంత్ కమల్ హాసన్ మల్టీస్టారర్ పనులు మొదలుపెట్టాలి. ఇది ఆషామాషీ సినిమా కాదు. 38 సంవత్సరాల తర్వాత ఇద్దరు దక్షిణాది లెజెండ్స్ స్క్రీన్ పంచుకోబోతున్నారు. దానికి తగ్గట్టే సెటప్, స్క్రిప్ట్ ఉండాలి. కొంచెం ఎక్కువ సమయం అవసరం పడేలా ఉండటంతో ఈలోగా ధర్మన్ పూర్తి చేసుకుందామని రజని అందులో బిజీ అయ్యారు. డిసెంబర్ కంతా ఫ్రీ అయిపోతారు.
ఈ లెక్కన రజని కమల్ మూవీ 2028లో రిలీజ్ అవుతుంది. అంతకన్నా ముందు కష్టమే. ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే డ్రాగన్ అయిపోయాక త్రివిక్రమ్ తో ప్యాన్ వరల్డ్ ఫాంటసీ మూవీ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి ఎంత సమయం పడుతుందో చెప్పలేం. కమర్షియల్ కథలకే ఎక్కువ టైం తీసుకునే మాటల మాంత్రికుడు ఇప్పుడీ విజువల్ గ్రాండియర్ కి ఎంత సమయం అడుగుతారో తెలియదు. ఇది కూడా ఇంచుమించు 2028 కంటే ముందు వచ్చే ఛాన్స్ లేదు.
సో ఈ కలయిక కార్యరూపం దాల్చాలన్నా రెండు సంవత్సరాలకు పైగా వెయిట్ చేయాల్సిందే. నాగవంశీ అయితే ఈ కాంబినేషన్ వదలను అనే పట్టుదల చూపిస్తున్నారు. మరి నెల్సన్ ఏమంటారో చూడాలి. ఎలాగూ జైలర్ 2 ప్రమోషన్స్ టైంలో బయటికి వస్తారు కాబట్టి అప్పుడేమైనా క్లారిటీ ఇస్తారేమో. తమిళ డైరెక్టర్లు ఈ మధ్య తెలుగు స్టార్లతో పని చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు. నెల్సన్ కూడా అదే రీతిలో టెంప్ట్ అయినట్టు ఉన్నాడు. తారక్ కోసం ఎలాంటి కథ రాసుకున్నాడో.

