బాలీవుడ్ బిగ్గెస్ట్ విజువల్ గ్రాండియర్ గా ప్రచారంలో ఉన్న రామాయణ పార్ట్ 1 దీపావళి విడుదలకు సిద్ధంగా ఉంది. ఇంకా డేట్ అనౌన్స్ చేయలేదు కానీ త్వరలోనే ఒక కొత్త టీజర్ తో దాన్ని ప్రకటించే అవకాశాలున్నాయని తెలిసింది. నిర్మాత నమిత్ మల్హోత్రా కొన్ని వారాలుగా ఈ సినిమా థియేటర్ బిజినెస్ క్లోజ్ చేసే పనిలో ఉన్నారు. ఒక్క మొదటి భాగం నుంచే 500 కోట్ల దాకా ఆశించినట్టు ముంబై వాసులు కొంత కాలం క్రితం ప్రచురించారు. కానీ అందులో సగమే దక్కినట్టు లేటెస్ట్ అప్డేట్.
ధర్మ ప్రొడక్షన్స్ అధిపతి కరణ్ జోహార్ ఈ ప్యాన్ ఇండియా మూవీ ఇండియా రైట్స్ 250 కోట్లకు ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది. ఇది మరీ భారీ మొత్తం కాదు కానీ ఒక హిందీ మూవీకి ఈ స్థాయి రేటు పలకడం విశేషమే. ఒకవేళ బ్లాక్ బస్టర్ అయిపోయి దురంధర్, పుష్ప రేంజ్ లో వేలకోట్ల వసూళ్లు కురిపిస్తే అంగీకరించిన మొత్తంలో స్వల్ప మార్పులు చేసుకునేందుకు పరస్పరం అంగీకారం జరిగిందట. ఇది అధికారికంగా వచ్చింది కాకపోయినా సమాచారమైతే విశ్వసనీయంగా ఉంది.
ఇటీవలే రామాయణ అరగంట ఫుటేజీని కొందరు ప్రముఖులకు చూపించి వారి ప్రశంసలు అందుకున్నట్లు యూనిట్లు చెబుతున్నాయి. జూలై వచ్చినా ఇంకా ప్రమోషన్ వేగం పెరగకపోవడం పట్ల రన్బీర్ కపూర్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే యష్ టాక్సిక్ ఆగస్ట్ 26 రిలీజ్ కానున్న నేపథ్యంలో దాని రన్ అయ్యాక రామాయణ పబ్లిసిటీ మొదలుపెట్టాల్సిందిగా రిక్వెస్ట్ వచ్చిందట. దానికి అనుగుణంగానే కొంత సైలెంట్ గా ఉన్నట్టు తెలిసింది.
సాయిపల్లవి సీతగా నటించిన రామాయణంలో సన్నీ డియోల్ హనుమంతుడిగా, రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖ, కాజల్ అగర్వాల్ మండోదరిగా నటిస్తున్నారు. దర్శకుడు నితేశ్ తివారి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో తల మునకలై ఉన్నారు. టీజర్ కు మిశ్రమ స్పందన రావడంతో ట్రైలర్ మీద ఒక్క కంప్లయింట్ రాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. రామాయణ ఏ తేదీ తీసుకుంటుందనే దాన్ని బట్టి ఇతర ప్యాన్ ఇండియా సినిమాలు తమ డేట్లని డిసైడ్ చేయాల్సి ఉంది.

