ఎన్టీఆర్ జిల్లాలో సంచలనం సృష్టించిన క్రాంతి కుమార్ ఆత్మహత్య కేసులో మాజీ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) నాగరాజుపై మరో కేసు నమోదైంది. మృతుడు రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియో ఆధారంగా, క్రాంతి కుమార్ ఆత్మహత్యకు నాగరాజు వేధింపులే కారణమని నిర్ధారించిన పోలీసులు కేసులో మార్పులు చేశారు. ఆత్మహత్యకు ప్రేరేపించడంతో పాటు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కృష్ణలంక పోలీసులు ఆయనపై కొత్త సెక్షన్లు నమోదు చేశారు. పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకునే ముందు క్రాంతి కుమార్, మాజీ సీఐ నాగరాజు తనను వేధించారని ఆరోపిస్తూ ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేశారు. ఈ వీడియో వెలుగులోకి రావడంతో కేసు కీలక మలుపు తిరిగింది. నార్త్ ఏసీపీ సత్యానందం మృతుడి కుటుంబ సభ్యుల నుంచి వావిమూలం సేకరించి, గతంలో నమోదైన అనుమానాస్పద మృతి కేసును సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, రౌడీ షీటర్ సాయి కృష్ణ కస్టడీ మృతి కేసులో నాగరాజు ఇప్పటికే సస్పెన్షన్కు గురై, అనంతరం అరెస్టయ్యారు. ప్రస్తుతం ఆయన రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.

