తిరుపతి ఎస్పీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టిన వైసీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం జరిగిన ఈ ఘటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించినట్లు ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఈ కేసులో నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సహా పలువురు వైసీపీ నేతల పేర్లను చేర్చారు. వివరాల్లోకి వెళితే.. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి వ్యతిరేకంగా ఉన్న ఫిర్యాదులు, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన ఫిర్యాదులు ఎస్పీకి వినతిపత్రం సమర్పించేందుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. అయితే, నిబంధనల ప్రకారం కేవలం ఐదుగురిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. ఇందుకు కార్యకర్తలు అంగీకరించిన ఎస్పీ కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద పోలీసులకు, నిరసనకారులకు మధ్య తోపులాట జరిగింది.
ఈ నేపథ్యంలో, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీయూ) పోలీస్ స్టేషన్లో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి, చంద్రమౌళిరెడ్డి, చెవిరెడ్డి రఘుతో పాటు మరో 30 మందికి పైగా పోలీసు విధులకు ఆటంకం కల్పించారని అభియోగంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

