జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు శనివారం శస్త్ర చికిత్స జరిగింది. ముంబైలో జరిగిన ఈ శాస్త్ర చికిత్సకు ఏకంగా 3.5 గంటల సమయం పట్టింది. ఏళ్ల క్రితం అయిన గాయాలకు సంబంధించి పవన్ చాలా కాలంగా విపరీతమైన నొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. 2018లో రెండు భుజాలకు గాయాలు కాగా… వాటికి సంబంధించిన చికిత్సను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే వాటిని మరింత కాలం వాయిదా వేయడానికి ఆపరేషన్ ప్రమాదమన్న వైద్యుల సూచనలతో తాజాగా చేయించుకున్నారు.
ఇటీవలే ముక్కుకు చేయించుకున్న శస్త్ర చికిత్స సందర్భంగా భుజాలకు ఉన్న గాయాలను ముంబై వైద్యులు గుర్తించారు. విపరీతమైన నొప్పి ఉన్న ఆ గాయాలను ఇంతకాలం ఎలా భరించారంటూ వైద్యులు పవన్ను ప్రశ్నించిన సంగతి తెలిసిందే. రెండు భుజాలకు అయిన గాయాలకు తక్షణమే చికిత్స చేయించుకోవాలని, లేని పక్షంలో ప్రమాదమేనని వైద్యులు సూచించారు. అయితే ఇప్పటికే డిప్యూటీ సీఎం హోదాలో ఖరారైన పలు కార్యక్రమాలను వాయిదా వేయలేని పవన్… వైద్యులు చెప్పినా… ఆపరేషన్ను వాయిదా వేశారు. తాజాగా శుక్రవారం ముంబై వెళ్లి… ఆపరేషన్ చేయించుకున్నారు.
శనివారం జరిగిన ఆపరేషన్లో కుడి భుజానికి మాత్రమే శస్త్ర చికిత్స జరిగింది. రొటేటర్ కఫ్ గాయానికి జరిగిన ఈ చికిత్సకు ఏకంగా 3.5 గంటల సమయం పట్టిందని వైద్యులు తెలిపారు. శనివారం నాటి ఆపరేషన్లో కేవలం కుడి భుజానికి మాత్రమే చికిత్స జరగాలి… ఎడమ భుజానికి రెండు నెలల్లోగా ఆపరేషన్ చేయాల్సి ఉంది. రెండు భుజాలకూ ఒకే సారి ఆపరేషన్ చేస్తే ఆ నొప్పి తీవ్రంగా ఉంటుందని, ఆ నొప్పిని భరించడం సాధ్యం కాదన్న భావనతోనే వైద్యులు ఒక్క భుజానికి మాత్రమే ఆపరేషన్ చేశారు. అంటే… రెండు నెలల్లోగా మరోమారు ముంబై వెళ్లి ఎడమ భుజానికి ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది.
పవన్ కు ఆపరేషన్ విజయవంతం అయిన తీరుపై తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కు ఆపరేషన్ సక్సెస్ అయిన విషయాన్ని తెలుసుకున్న టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. పవన్ త్వరగా కోలుకోవాలని కోరుతూ ఆయన ఓ సందేశాన్ని విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నేతలు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు కూడా పవన్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ సందేశాలు విడుదల చేస్తున్నారు. ఆపరేషన్ విజయవంతం కావడం పట్ల ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ హర్షం వ్యక్తం చేశారు.

