తుంగతుర్తి : తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. పార్టీ మండల అధ్యక్షుల నియామకంలో ఎమ్మెల్యే మందుల సామేల్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికే పదవులు కట్టబెట్టారని సీనియర్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘర్షణలకు, దాడులకు దారితీసింది.తుంగతుర్తి కాంగ్రెస్‌లోని అంతర్గత పోరు తీవ్ర వివాదం అయ్యింది. దీంతో పార్టీ నాయకత్వం రంగంలోకి దిగి నియోజకవర్గంలో పరిస్థితిపై చర్చించేందుకు నేతలతో సమావేశం అయింది. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తుంగతుర్తి పంచాయతీని పరిష్కరించేందుకు ముందుకు వచ్చారు. ఆయన ఇద్దరు వరగాల నేతలతో సమావేశమయ్యారు.
తుంగతుర్తి నియోజకవర్గంలో వర్గపోరు, ఘర్షణలు తీవ్రమయ్యాయి. ఎమ్మెల్యే మందుల సామేల్, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గాలకు మధ్య తీవ్ర ఆధిపత్య పోరు సాగుతోంది. అర్వపల్లి వద్ద ఇరువర్గాల కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడులు చేయడం కలకలం రేపింది. మండల అధ్యక్షుల మార్పులపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీనియర్ నేత యోగానంద చారి ఆధ్వర్యంలో నాయకులు గాంధీ భవన్లో ధర్నా చేశారు. ఎమ్మెల్యే సామెల్ పాత కాంగ్రెస్ నాయకులను పట్టించుకోవడం లేదని అన్నారు.ఇతర పార్టీ నాయకులకే పదవులను కట్టబెడుతూ జెండా మోసిన వారిని పక్కన పెడుతున్నారు తుంగతుర్తి కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
అయితే తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్‌పై క్లారిటీ ఇచ్చారు. మండల అధ్యక్షుల నియామకాల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని, అధిష్ఠానం నిర్ణయించినవారే కొనసాగుతారని ఎమ్మెల్యే సామెల్ తేల్చి చెప్పారు. పరిస్థితి చేయి దాటడంతో టీపీసీసీ రంగంలోకి దిగింది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని తుంగతుర్తి వ్యవహారాల పరిశీలకునిగా నియమించారు. సమస్య పరిష్కారానికి జగ్గారెడ్డి గాంధీ భవన్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి నాయకులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే గాంధీ భవన్ లోనూ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కొందరు కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. దీనితో తుంగతుర్తి నియోజకవర్గం అధిష్టానానికి తలనొప్పిగా తయారైంది.

