ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజ ధాని నిర్మాణం కోసం వేలాది మంది రైతులు భూములు ఇచ్చారు. తద్వారా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అయితే.. రాజధాని తొలి విడత భూ సమీకరణలో కొందరు రైతులు భూములు ఇవ్వలేదు. తాము భూములు ఇచ్చేది లేద’ని భీష్మించారు.
అయితే.. రైతులు ఇవ్వని భూముల కారణంగా.. రహదారులు వంకర టింకరగా నిర్మించాల్సి వస్తోంది. రైతులు ఇవ్వని భూములను వదిలేసి… ఇచ్చిన వాటిలోనే నిర్మాణాలు చేపడుతున్నారు. దీనివల్ల రాజ ధాని స్వరూపమే దెబ్బ తింటోంది. ఇటీవల ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు రాజదానిలో పర్యటించినప్పుడు ఈ విషయం చర్చకు వచ్చింది. దీనితో ఆ వెంటనే ప్రభుత్వ 2013నాటి కేంద్ర చట్టం మేరకు భూ సేకరణకు సిద్ధమైంది.
రాజధానిలో ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణాలకు మధ్యలో సుమారు 700 ఎకరాల మేరకు పూలింగ్ లో ఇవ్వాలని.. రైతులకు పదే పదే అధికారులు విన్నవించారు. నోటీసులు ఇచ్చారు. అయినా రైతులు పట్టించుకోలేదు. దీనికి వైసీపీ మద్దత కూడా ఉండడంతో వారు న్యాయపోరాటానికి దిగారు. హైకోర్టులో పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు వారికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. అయితే పరిహారం ఇచ్చి భూములు తీసుకోవాలని ప్రభుత్వాన్ని నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో తాజాగా శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో భూ సేకరణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీనితో శనివారం ఉదయమే కీలకమైన `సీడ్ యాక్సిస్ రోడ్డు` పరిధిలో భూములు ఇవ్వని రైతుల నుంచి ఆయా భూములను సీఆర్ డీఏ అధికారులు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులను భారీగా మోహరించారు. అయితే.. వారికి ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా పొలాల్లో పంటను ధ్వంసం, భూములు ఆక్రమించుకుంటున్నారు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో అడ్డుకున్న రైతులను పోలీసులు అరెస్టు చేయగా.. మరికొందరు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

