భారత సిలికాన్ సిటీ, ఐటీ రాజధాని దేశ బెంగళూరు ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సెలబ్రిటీలు సైతం ట్రాఫిక్ నరకయాతన గురించి ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పొద్దున్న ఇంటి నుంచి ఆఫీసుకు బయలుదేరితే ఎప్పుడు చేరుకుంటామో తెలియని పరిస్థితి.. తాజాగా ఈ ట్రాఫిక్ సమస్య, లోపభూయిష్టమైన నగర ప్రణాళికను ఎండగడుతూ ఒక ప్రయాణికుడు చేసిన సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన వీడియోలో వ్యక్తి బెంగళూరులోని తన నివాసం నుండి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లేందుకు పడుతున్న సమయాన్ని..తన విమాన ప్రయాణ సమయాన్ని పోల్చి చూపారు.
బెంగళూరు హెచ్ఎస్ఆర్ లేఅవుట్ నుండి విమానాశ్రయానికి చేరుకోవడానికి కారులో దాదాపు రెండున్నర నుండి మూడు గంటల సమయం పడుతుండగా.. బెంగళూరు నుండి కోల్‌కతాకు విమానంలో వెళ్లడానికి కేవలం రెండు గంటల ఇరవై నిమిషాలు మాత్రమే పడుతుందని ఆయన చెప్పారు. అంటే ఒక వ్యక్తి రోడ్డు మార్గంలో స్థానిక ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే సమయంలో.. ఏకంగా వేల దూరంలో ఉన్న కోల్‌కతా నగరానికి విమానంలో చేరుకోవచ్చని ఆయన నగర ట్రాఫిక్‌ను ఎద్దేవా చేశారు.
తాను న్యూయార్క్, చికాగో వంటి అంతర్జాతీయ మెట్రోపాలిటన్ నగరాలతో సహా అనేక ప్రాంతాలు తిరిగానని.. అక్కడ కూడా విమానాశ్రయాలు నగరం వెలుపలే బలమైన రవాణా అనుసంధానం వల్ల చాలా తక్కువ సమయంలో చేరుకోవచ్చని గుర్తుచేశారు. అయితే మన అధికారులు మౌలిక సదుపాయాలు, ప్రజా రవాణాను ముందుగా ప్లాన్ చేయకుండా కేవలం నగరానికి సుదూరంగా విమానాశ్రయాలను నిర్మించడం వల్లే ప్రయాణికులకు ఈ ఇబ్బందులు తప్పడం లేదు. మన నగర ప్రణాళికలు ప్రజల సమస్యలను పరిష్కరించకపోగా.. మరిన్ని పెద్ద సమస్యలను సృష్టిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలామంది ప్రయాణికులు ఆయన ఆవేదనతో ఏకీభవిస్తూ తమకు కూడా ఇలాంటి దారుణమైన ట్రాఫిక్ జామ్‌లను, అధ్వాన్నపు రోడ్లను బెంగళూరు నగరంలో ఎదుర్కొంటున్నామని కామెంట్లు పెడుతున్నారు. మెట్రో పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయని కొందరు వాపోయారు.
అయితే మరికొందరు బెంగళూరు వాసులు నగరాన్ని సమర్థిస్తూ.. ఐటీ రంగం అంచనాలకు మించి విస్తరించడం వల్ల జనాభా ఒక్కసారిగా రెట్టింపు అయిందని పేర్కొన్నారు. ఈ విపరీతమైన జనాభా ఒత్తిడి వల్ల రద్దీ పెరిగిందని.. అయినప్పటికీ బస్సు రవాణా వ్యవస్థలో బెంగళూరులో ఇప్పటికీ దేశంలోనే అత్యుత్తమంగా ఉందని వారు అభిప్రాయపడ్డారు.

