సమస్యల పరిష్కారంలో సర్కార్ వైఫల్యం
- ప్రజల దృష్టి మరల్చేందుకు ‘డైవర్షన్ పాలిటిక్స్’
- ‘ఉపా’కు వ్యతిరేకంగా ఐదు నగరాల్లో కార్యక్రమాలు
- ఆగస్టు 6`15’మార్పు కోసం’ సీపీఐ పాదయాత్రలు
- 17 నుండి 27… ప్రజాసంఘాల నిరసనలు
- సెప్టెంబర్ 1న ‘చలోదిల్లీ’కి ఏపీ నుంచి 3 వేల మంది
- కడపలో పార్టీ రాష్ట్ర ప్లీనరీ
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రంలో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని…ప్రజల దృష్టిని మరల్చేవిధంగా ‘డైవర్షన్ పాలిటిక్స్’కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే ప్రజాస్వామిక శక్తులపై అక్రమ కేసులు, ఉపా చట్టం అమలు చేయడం ప్రజాస్వామ్య విలువలపై జరుగుతున్న దాడిలో భాగమని ఆయన చెప్పారు. విజయవాడ దాసరి భవన్లో మంగళవారం ఈశ్వరయ్య విలేకరుల సమావేశం జరిగింది. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశంలో ఆయన ఒక తీర్మానం చేశారు. వర్షాభావ పరిస్థితుల్లో రైతాంగం కరువు కాటకాల్లో కూరుకుపోతున్నారని… గిట్టుబాటు ధర లేక ఆక్వా, పొగాకు, మామిడి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సాక్షాత్తు సీఎం చంద్రబాబు మామిడి, పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ కేంద్రానికి లేఖలు రాసినప్పటికీ స్పందన లేకపోవడం చూస్తుంటే… రాష్ట్ర ప్రభుత్వ పాలనపై పట్టులేదనేది స్పష్టమవుతోంది. ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని… పోలీసుల వేధింపుల పర్వం కొనసాగడం విచారకరమన్నారు. విజయవాడలో గాదె సాయికృష్ణ, పేరుపోగు క్రాంతికుమార్, కర్నూలు జిల్లాలో గంగమ్మ సంఘటనలే ఇందుకు నిదర్శనమని తెలిపారు. ఇదే విధమైన దళిత క్రైస్తవ సభకు వెళ్లి మాట్లాడిన ప్రశ్న రావణ్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న నెపంతో ఉపా చట్టం నమోదు చేశారన్నారు. ఈ చట్టాన్ని భిన్నాభిప్రాయాలను వ్యక్తంచేసే హక్కును హరించడానికి, ప్రజల భయభ్రాంతులకు గురిచేయడానికి దుర్వినియోగం ఉన్నట్లు చెప్పారు. ఉపా ప్రయోగించడాన్ని సీపీఐ పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఉపా చట్టానికి వ్యతిరేకంగా విజయవాడలో ఇటీవల సీపీఐ నిర్వహించిన రౌండ్టేబుల్పై కొందరు అనాలోచిత వ్యాఖ్యలు తప్పుపట్టారు. ఉపా చట్టంపై కేసు పెట్టడం తగదంటూ మాట్లాడిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎబీ వెంకటేశ్వరరావుపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేయడాన్ని ఖండించారు. పవన్ కల్యాణ్ ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ విధానాలను రాష్ట్రంలో తీసుకురావాలంటూ వ్యాఖ్యానిస్తున్న తీరును తప్పుబట్టారు. తాము ఏ మతానికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ఉపా చట్టాన్ని వ్యతిరేకిస్తూ సీపీఐ…రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, గుంటూరు, అనంతపురం నగరాల్లో మేధావులు, న్యాయవాదులు, రచయితలు, జర్నలిస్టులు, ప్రజాస్వామ్యవాదులు, వివిధ రాజకీయ పక్షాలతో కలిసి విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడబోమని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు…బీజేపీ రాజకీయ ఎజెండాను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. బీజేపీ చెప్పిందే అమలు చేస్తూ పోతే భవిష్యత్తులో టీడీపీ రాజకీయ ఉనికిని బీజేపీ దెబ్బతీయడం ఖాయమన్నారు. యూట్యూబర్లు, సోషల్ మీడియా కార్యకర్తలకు నోటీసులు జారీ చేయడం, టాస్క్‌ఫోర్స్‌లో ఏర్పాటు చేసి భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అన్నారు. జనసేనలోని జనసేన, టీడీపీ, బీజేపీకి చెందిన సోషల్ మీడియా ఖాతాలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే వారిని ప్రోత్సహిస్తూ, ప్రజలను ప్రశ్నిస్తే గొంతులను అణచివేయడం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుందని చెప్పారు. పోలీస్ స్టేషన్లపై దాడులు చేయమని ప్రోత్సహించడం ఏ చట్టంలో ఉందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ, రైతాంగం, కార్మికులు, మహిళలు, దళితులు, గిరిజనులు, మైనార్టీల హక్కుల కోసం సీపీఐ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తోంది. పార్టీ జాతీయ సమితి పిలుపు మేరకు ఆగస్టు 6 నుంచి 15 వరకు ‘మార్పు కోసం’ అనే నినాదంతో రాష్ట్రంలో ప్రచార యాత్రలు, పాదయాత్రలు నిర్వహించామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతోన్న ప్రజా వ్యతిరేక విధానాలపై రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలు, 674 మండలాలు, వందలాది గ్రామాల్లో కేంద్రాలు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించే కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. ఆగస్టు 17 నుంచి 27 వరకు పార్టీ అనుబంధ ప్రజాసంఘాలు తమ సమస్యలపై నిరసనలు తెలిపారు. సెప్టెంబర్ 1న ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో జరిగే మహాసభకు రాష్ట్రం నుంచి సుమారు మూడు వేల మందిని సమీకరిస్తామని. సెప్టెంబర్ చివరి వారంలో కడపలో నాలుగు రోజులపాటు సీపీఐ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు నిర్వహించామని, రాష్ట్రంలో భవిష్యత్ పోరాటాలకు సంబంధించిన కార్యాచరణను అక్కడ ఖరారు చేశారు. రాష్ట్రంలోని అప్రకటిత ఎమర్జెన్సీ వాతావరణం దేశంలో నెలకొంటోందని ఆయన ప్రకటించారు. ప్రజాస్వామ్య హక్కులు, భావప్రకటన స్వేచ్ఛ, సమావేశాల హక్కు క్రమంగా హరింపవేస్తున్నాయని, ప్రజలంతా మేల్కొనాలని అన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సీపీఐ ఇచ్చిన ఉద్యమ పిలుపులో ప్రజలు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ మాట్లాడుతూ … ఎలాంటి షరతులు లేకుండా వెంటనే 33 శాతం మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లోక్‌సభ 543 స్థానాల్లో కనీసం 181 స్థానాలు మహిళలకు కేటాయించాలని నిర్ణయించారు. మహిళల రాజకీయ భాగస్వామ్యం పెరిగితేనే వారి భద్రత, సాధికారత, సామాజిక న్యాయం సాధ్యమవుతుందని అన్నారు. పార్లమెంట్ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని అన్ని రాజకీయ పార్టీలను కోరుతూ ఇప్పటికే పార్లమెంట్ సభ్యులకు వినతి పత్రాలు అందజేశామన్నారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.హరినాథరెడ్డి, దోనేపూడి శంకర్ ఉన్నారు.

