విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ కేసులు చెదురుమదురుగా బయటపడుతున్నాయి. జూన్ 26 నుంచి జులై 16 వరకు మొత్తం 12 మంది కోవిడ్ వైరస్ బారిన పడ్డారు. కోవిడ్ పాజిటివ్‌గా తేలినవారిలో కడప జిల్లాకు చెందిన ముగ్గురు, కాకినాడ జిల్లాకు చెందిన ఒకరు మృతి చెందారు. అంతకుముందే వారు తీవ్రమైన బీపీ, షుగర్, కిడ్నీ, ఇతర తీవ్ర వ్యాధులతో బాధపడుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీర పాండియన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది తొలి కోవిడ్ కేసు జూన్ 26న కడప జిల్లాలో నమోదైంది. జులై 1 నుంచి 16 వరకు మరో 11 కేసులు బయటపడ్డాయి. వీరిలో కోవిడ్ సోకిన వ్యక్తులతో ఇద్దరు సన్నిహితంగా మెలిగినవారిగా గుర్తించారు. మొత్తం కేసుల్లో కడప జిల్లాలో అత్యధికంగా ఎనిమిది నమోదయ్యాయి. గుంటూరులో రెండు, విశాఖపట్నం, కాకినాడ జిల్లాల్లో ఒక్కక్కటి చొప్పున వెలుగుచూశాయి. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ముందు జాగ్రత్తలు పాటించాలని, వైద్యులు, ఆసుపత్రులు సిబ్బందిని అప్రమత్తం చేశామని వీరపాండియన్ తెలిపారు.
పోస్ట్ 12 కోవిడ్ కేసులు నలుగురి మృతి మొదట కనిపించింది విశాలాంధ్ర.

