కాలువ వెడల్పు పనులు పూర్తి చేస్తేనే రాయలసీమకు సాగునీటి భరోసా…
జీవోలు కాగితాలకే పరిమితం… రైతులకు అందని హంద్రీ నీవా జలాలు
హంద్రీనీవా కాలువను పరిశీలించిన సీపీఐ నేతల బృందం..
విశాలాంధ్ర–అనంతపురం,: రాయలసీమ రైతాంగానికి జీవనాడిగా భావించే హంద్రీనీవా కాలువ అభివృద్ధిపై అధికార, ప్రతిపక్ష పార్టీలు పరస్పర విమర్శలు మానేసి, కాలువ విస్తరణ పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించడంపై దృష్టి సారించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్ అన్నారు. ఆత్మకూరు మండల కేంద్రం సమీపంలోని హంద్రీనీవా కాలువను మంగళవారం సీపీఐ జిల్లా బృందంతో కలిసి పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
టీడీపీ, హంద్రీనీవా పేరుతో ఒకరిపై ఒకరు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటూ తమ ప్రభుత్వాల ఘనతను చాటుకునే ప్రయత్నం నాయకులు. కాలువ వెడల్పు చేసి 50–60 టీఎంసీల నీటిని తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నా, ఇప్పటికీ రైతుల పంట పొలాలకు సాగునీరు ఎందుకు చేరలేదనే ప్రశ్నకు సమాధానం చెప్పారు. 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నిధులు కేటాయించి పనులు ప్రారంభించారని గుర్తు చేశారు. 2012లో ట్రయల్‌రన్ నిర్వహించి, 2013 నుంచి కృష్ణా జలాలు హంద్రీనీవా వస్తున్నప్పటికీ, ప్రాజెక్టుల లక్ష్యాలు మాత్రం నేటికీ నెరవేరలేదని పేర్కొన్నారు. ఈ ఉద్దేశంతో 2017లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 6,100 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యానికి కాలువ వెడల్పు చేశారు, అనంతరం 2020లో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 6,300 క్యూసెక్కులకు విస్తరణ చేపట్టాలని మరో జీవో తెచ్చిందని గుర్తు చేశారు. అయితే రెండు ప్రభుత్వాల జీవోలు అమలుకాక కాగితాలకే పరిమితమయ్యాయని.ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా స్వల్పంగా మాత్రమే కాలువను విస్తరించి 3,850 క్యూసెక్కుల ప్రవాహానికి పరిమితం చేసిందని అన్నారు. గతంలో హామీల ప్రకారం 6,100 క్యూసెక్కుల సామర్థ్యానికి ఎందుకు విస్తరించడం లేదని ప్రశ్నించారు.కాలువకు ఇరువైపులా కాంక్రీటీకరణ చేయడం వల్ల భవిష్యత్తులో మరింత వెడల్పు చేస్తే మళ్లీ ఆ నిర్మాణాలను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, ఇది ప్రజాధనాన్ని వృథా చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు దశాబ్దాలు గడిచినా డీపీఆర్‌లో లక్ష్యాల ప్రకారం కృష్ణా జలాలను రైతులకు అందించలేకపోయామని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీల భేదాభిప్రాయాలను పక్కనబెట్టి హంద్రీనీవా రాయలసీమలో ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఐక్యంగా పోరాడాలని ఇప్పటికైనా పిలుపునిచ్చారు. ఆగస్టులో నిర్వహించే సీపీఐ జీపు జాతాలో హంద్రీనీవాతో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రధాన అజెండాగా ప్రభుత్వం మెడలు వంచేలా ఉద్యమాలు నిర్వహించామని తెలిపారు.హంద్రీనీవా ద్వారా రైతులకు సాగునీరు అందించి స్వాతంత్ర్య సమరయోధుడు ఆదినారాయణరెడ్డి, మాజీ ముఖ్యమంత్రులు నందమూరి తారక రామారావు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయాలను సాకారం చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రామకృష్ణ, గోపాల్, అనంతపురం మండల కార్యదర్శి నరేష్, ఆత్మకూరు మండల కార్యదర్శి శివ, జిల్లా కౌన్సిల్ సభ్యుడు రామకృష్ణ, సీపీఐ నాయకులు ఓబులేసు, సరస్వతమ్మ, నల్లమ్మ, కృష్ణమూర్తి, తిరుపాల్ నాయక్ గోపాల్ నాయక్, వెంకటేశ్, తులసినాయక్ పాల్గొన్నారు.
పోస్ట్ హంద్రీనీవాపై టీడీపీ–వైసీపీ రాజకీయాలు మానాలి..సీపీఐ మొదట కనిపించింది విశాలాంధ్ర.

