కోలీవుడ్ స్టార్ హీరో , దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయకన్’ ఎట్టకేలకు థియేటర్లలోకి ఈరోజు ( జూలై 23, 2026 ) వచ్చింది. తమిళనాడు సీఎంగా బాధ్యత చేపట్టిన తర్వాత రిలీజ్ అయిన తొలి , సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. థియేటర్లలో అభిమానుల ఆనందాన్ని హద్దులే లేవు. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ తొలి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది.
అయితే ఈ గ్రాండ్ రిలీజ్ రోజే చెన్నైలోని రోహిణి థియేటర్ వద్ద అనూహ్య వాతావరణం నెలకొంది. కారణం… గ్లామరస్ క్వీన్ త్రిష కృష్ణన్ తన తల్లి ఉమా కృష్ణన్‌తో కలిసి వచ్చి ‘జన నాయకన్’ చూశారు. ఆమె రాకతో థియేటర్ పరిసరాలు ఒక్కసారిగా సందడిగా మారాయి. అభిమానులు ఆమెను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
సినిమా చూసిన అనంతరం త్రిష తల్లి ఉమా కృష్ణన్ భావోద్వేగానికి లోనయ్యారు. విజయ్‌ని ఇకపై వెండితెరపై నటుడిగా చూడకపోవడం చాలా బాధగా ఉంది. ఇది ఆయనకు చివరి చిత్రం కావడం జీర్ణించుకోలేకపోతున్నాం. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చూడాల్సిన అద్భుతమైన సినిమా ఇది అని కొనియాడారు.
హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందించిన ‘జన నాయకన్’లో యాక్షన్, భావోద్వేగాలు, రాజకీయ నేపథ్యం కలగలిపిన కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా విజయ్ స్క్రీన్ ప్రెజెన్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, క్లైమాక్స్ సన్నివేశాలకు ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. విజయ్ సినీ ప్రయాణానికి ఈ చిత్రం ఘనమైన ముగింపుగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. థియేటర్లో త్రిష కనిపించడం, విజయ్‌పై ఆమె వ్యక్తం చేసిన ప్రేమాభిమానాలు ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
త్రిష, విజయ్ కాంబినేషన్‌కి తమిళ సినీ పరిశ్రమలో ప్రత్యేక క్రేజ్ ఉంది. 2004లో విడుదలైన ‘గిల్లి’తో మొదలైన వీరి ప్రయాణం ‘తిరుపాచి’, ‘ఆతి’, ‘కురువి’, ‘లియో’ వంటి విజయవంతమైన చిత్రాల వరకు కొనసాగింది. ‘గాట్’ సినిమాలో కూడా త్రిష అతిథి పాత్రలో మెరిసి అభిమానులను అలరించింది. ఇప్పుడు ‘జన నాయకన్’ ప్రదర్శనకు ఆమె హాజరు కావడం అభిమానులకు మరింత స్పెషల్‌గా మారింది.

