ఏందన్నా…. పుసుక్కున అంత మాట అనేశావ్. మనోళ్ళు తలెత్తుకోలేకపోతున్నారు. అలా ఎలా ఇరికించావ్’ అంటూ సొంత పార్టీ నాయకులే ప్రశ్నిస్తుంటే వైసీపీ నేత సమాధానం చెప్పలేకపోతున్నారట. అదే సమయంలో ఆయన మాటల్ని అడ్వాంటేజ్ తీసుకున్న టీడీపీ చెలరేగిపోతోంది. అసలు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే….. అంటూ మాజీ ఎమ్మెల్యే సన్నాయి నొక్కులు నొక్కుతున్నా ఎవరి చెవికి ఎక్కడం లేదు. ఎవరా ఎక్స్ ఎమ్మెల్యే? ఆయన వివరణలు జనానికి చేరుతున్నాయా? డబ్బు పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోవచ్చుగానీ…. నోరు జారితే వెనక్కి తీసుకోలేమని అంటారు. తెలిసి అన్నా… తెలియక అన్నా… ఆవేశంలోనో, ఆవేదనతోనో యాదృచ్చికంగా బయటికి వచ్చిందా… నోరు జారిన మాట ఎంత డ్యామేజ్ చేయాలో అంతా చేస్తుంది. ప్రస్తుతం ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకుడు విశ్వేశ్వర్‌రెడ్డి అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారట. ఏ ఉద్దేశ్యంతో అన్నారోగానీ…. సరిగ్గా ఒక్క నిమిషం వ్యవధి లోపు ఆయన మాట్లాడిన మాటలు
ప్రస్తుతం సొంత పార్టీ వైసీపీతో పాటు వ్యక్తిగతంగా మాజీ ఎమ్మెల్యేని కూడా ఇరుకున పెడుతున్నాయంటున్నారు. ఆ వ్యాఖ్యల ఆధారంగా అధికార పక్షం నేతలు విశ్వేశ్వర్‌రెడ్డితో ఒక ఆట ఆడుకుంటున్నారట. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ వైసీపీ ఉద్యమం చేపట్టింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం, గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టుల సాధన టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇటీవల నెల్లూరులో ఒక సమావేశం నిర్వహించింది. ఈ మీటింగ్‌లో విశ్వేశ్వరరెడ్డి అన్న మాటలే ఇప్పుడు మరాంగ్ అయినట్టు చెబుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం హంద్రీ-నీ కూటమితోపాటు ప్రాజెక్టుల అభివృద్ధి, లైనింగ్ పనుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతోందని, కొత్తగా పలు పనులు చేపడుతోందని కొన్ని వివరాలను ప్రస్తావించారాయన. మనం అధికారంలో ఉన్నప్పుడు కేవలం సంక్షేమ పథకాలంటూ పోయామని, హంద్రీ-నీవా ప్రాజెక్టుపై సరిగా ఫోకస్ చేయలేదన్నట్టు మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు. ఆ తర్వాత హంద్రీనీవా పనుల్లో కోట్లాది రూపాయల అవినీతి చేశారంటూ కూటమి ప్రభుత్వంపై యథావిథిగా ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణల సంగతి ఎలా ఉన్నా…అంతకు ముందు అన్న మాటల్ని గట్టిగా పట్టుకున్నారు కూటమి నాయకులు. హంద్రీనీవా విషయంలో మేమేం చేశామో మీ పార్టీ నేత చెబుతున్నారు.
అదిగో చూడండి అంటూ… వైసీపీని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. విశ్వేశ్వరరెడ్డి అన్న మాటలను ఒకటికి రెండు సార్లు చెప్పవలసి ఉంటుంది. ఉమ్మడి అనంతపురం జిల్లా టిడిపి నేతలంతా విశ్వ మాటలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. పైగా ఆయనకు హంద్రీనీవా ప్రాజెక్ట్ మీద పూర్తి అవగాహన ఉందని, కమ్యూనిస్ట్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చారని, అబద్ధాలు చెప్పరంటూ టీడీపీ నేతలే కితాబునిస్తూ… ఆ మాటల్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో ఉన్నారు. దీనితో… ఒక రకంగా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది ప్రతిపక్షం. మరోవైపు సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ట్రోల్ అవుతుండడంతో… అసలు నెల్లూరులో ఏం జరిగిందో వివరణ ఇవ్వాల్సి వచ్చింది విశ్వేశ్వర్ రెడ్డి. తన వ్యాఖ్యలు వివాదాస్పదమైనా మొదట్లో స్పందించలేదాయన. కానీ… క్రమంగా మేటర్ సీరియస్ అవడం, నెల్లూరు వ్యాఖ్యలపై స్పందించమని జిల్లా నాయకులు సూచించడం, టీడీపీ నేతలు హంద్రీనీవా యాత్రలో ప్రతి ఒక్కరూ తననే టార్గెట్ చేయడంతో…’గా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. నెల్లూరు మీటింగ్‌లో తాను మాట్లాడిన మాటలను మధ్యలో కట్ చేసి వారికి అనుకూలంగా టీడీపీ ప్రచారం చేసుకుంటోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారాయన. మీరు కోట్లు ఖర్చు పెట్టామని చెప్పుకుంటూ అవినీతికి పాల్పడ్డారని నేను అంటే.. దాన్ని ఎడిట్ చేసి ఇలా చీప్’ పాలిటిక్స్ చేస్తారా అంటూ. అసలు సాగునీరు, వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాల మీద చంద్రబాబుకు ఏ రోజూ మంచి అభిప్రాయం లేదు.. ఆ తర్వాత నేను చాలా సార్లు చెప్పానంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు విశ్వేశ్వర్‌రెడ్డి. నేను ఆ రోజు ఏం మాట్లాడానో నాకు, మా అధినేత జగన్‌కు తెలుసునని అన్నారాయన. పార్టీలో ఉంటూ ఆ సిద్ధాంతానికి వ్యతిరేకంగా మాట్లాడే నైజం నాది కాదంటూ తీవ్రంగా స్పందించారు. ఆయనైతే తీవ్రంగానే స్పందించారుగానీ…. డ్యామేజ్ మాత్రం అప్పటికే జరిగింది. ఎంత క్లారిటీ ఇచ్చుకున్నా.. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతోంది. ఎందుకన్నా అలా మాట్లాడావ్ అంటూ సొంత పార్టీ నేతలు అడుగుతుంటే….. మాట్లాడు…. ఇంకా బాగా మాట్లాడు అంటూ అధికార పార్టీ నేతలు విశ్వకు కితాబు ఇస్తున్నారట.

