ఒక దశలో ‘కంచె’, ‘ఫిదా’, ‘తొలి ప్రేమ’, ‘ఎఫ్-2’ లాంటి విజయాలతో మెగా కుర్రాడు వరుణ్ తేజ్ కెరీర్ మంచి ఊపు మీదే ఉండేది. కానీ తర్వాత సరైన సినిమాలు ఎంచుకోక తప్పాడు వరుణ్. అందులో గత మూణ్నాలుగేళ్లలో పరిస్థితి ఘోరంగా తయారైంది. ఎంతో కష్టపడి చేసిన గని, మట్కా సినిమాలు దారుణమైన ఫలితాలు అందుకుని వరుణ్ మార్కెట్‌ను బాగా దెబ్బ తీస్తాయి.
థియేటర్ల నుంచి పెద్దగా ఏమీ తీసుకురాలేకపోయిన చిత్రాలకు ఓటీటీలో కూడా ఆశించిన స్పందన రాలేదు. ఈ ప్రభావం వరుణ్ భవిష్యత్ చిత్రాల మీద కూడా పడుతుందేమో అనిపించింది. ఐతే కొంచెం గ్యాప్ తీసుకుని వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీతో ‘కొరియన్ కనకరాజు’ సినిమా లైన్లో పెట్టిన మెగా కుర్రాడు జనాల్లో ఈ సినిమా పట్ల ఆసక్తి రేకెత్తించగలిగాడు. ఈ మూవీ ప్రోమోలు ఇంట్రెస్టింగ్గా అనిపించాయి.
ఆగస్టు 7న ‘కొరియన్ కనకరాజు’ ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఈ సినిమా బిజినెస్ గురించి మీడియాలో వస్తున్న వార్తలు కొంత ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ‘కొరియన్ కనకరాజు’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఒక ఓటీటీ సంస్థ రూ.26 కోట్లకు కొన్నట్లుగా చెబుతున్నారు. కానీ ఈ నంబర్ అనుమానాలు రేకెత్తిస్తోంది.
డిజిటల్ మార్కెట్ ఈ మధ్య బాగా దెబ్బ తిన్న సంగతి తెలిసిందే. పెద్ద పెద్ద సినిమాలకు కూడా అనుకున్న రేట్లు రావట్లేదు. ఇలాంటి టైంలో వరుస ఫ్లాపుల్లో ఉన్న హీరో సినిమాను ఇంత రేటు పెట్టి కొంటారా అన్నది సందేహం. ముందేమో రైట్స్ రూ.15 కోట్లకు అమ్ముడైనట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడేమో రూ.26 కోట్లు అంటున్నారు.
ఐతే ఈ మధ్య కొన్ని సినిమాలకు ఇలా ఎక్కువ రేటు అని వార్తలు వస్తున్నా.. అది థియేటర్లలో రాబట్టే వసూళ్లను బట్టి ఇచ్చే ధర అంటున్నారు. ఇన్ని కలెక్షన్లు వస్తేనే ఈ రేటు.. కలెక్షన్లు తగ్గితే ఆ మేరకు డిజిటల్ హక్కుల రేటు కూడా తగ్గించేలా ఓటీటీలో వ్యూస్‌ను బట్టి కూడా ఫైనల్ రేటు నిర్ణయించేలా డీల్స్ ఉంటున్నాయి. ‘కొరియన్ కనకరాజు’కు కూడా అలాంటి కండిషన్ పెట్టే ఈ రేటు చెప్పి ఉంటారని అనుకోవచ్చు.

